జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా.. రేఖా నాయక్ రాజీనామా..

బీఆర్ఎస్కు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో మనస్థాపానికి గురైన రేఖా నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. 

ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి కేటీఆర్ అడ్డుకున్నారని ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తన స్నేహితుడి కోసం ఖానాపూర్ అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. తన స్నేహితుడి కోసం తనకు టికెట్ కేటాయించలేదన్నారు. జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదన్నారు. కేటీఆర్ తనకు, ఖానాపూర్ నియోజకవర్గానికి చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగడతానన్నారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. 

ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిందన్నారు రేఖానాయక్. తాను ఏం తప్పు చేశానో..ఎందుకు టికెట్ ఇవ్వలేదో నిరూపించాలని సవాల్ విసిరారు. కల్వకుంట్ల ఫ్యామిలీ చప్రాసీకి టికెట్ ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళకు టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్..మహిళా సంక్షేమం మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో మహిళలకు విలువలేదన్నారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి..రేఖా నాయక్ ఎమ్మెల్యేగా ఉంటే ఖానాపూర్ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మి ఓటేశారని గుర్తు చేశారు. కానీ ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు ఇవ్వకుండా డెవలప్మెంట్ను అడ్డుకున్నారని ఆరోపించారు. 

ఖానాపూర్ నియోజకవర్గంలో ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారని రేఖా నాయక్ మండిపడ్డారు. తన కుటుంబం గురించి బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్  చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జాన్సన్ తప్పుడు మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని.. పోలీసుల పిచ్చిచేష్టలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని...ప్రజలంతా తన వెంటే ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. జాన్సన్ నాయక్ .. ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ రేఖా నాయక్ సవాల్ విసిరారు.