కామారెడ్డి/ భిక్కనూరు, వెలుగు: ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధరణి రద్దు చేసి మళ్లీ పట్వారీ వ్యవస్థ తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తున్నదని విమర్శించారు. ధరణి రద్దు అయితే రైతులకు తిప్పలు తప్పవని అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, బీబీ పేట మండలం మాందాపూర్, జనగామలో శనివారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
‘‘పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు మాకు ఓటేయండి. ధరణిలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు.. నేను కాదనడం లేదు.. ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లును కాలబెట్టుకోం కదా? ధరణి కూడా 90 శాతం మంచిగానే ఉన్నది.. ఆ పది శాతం కూడా సరి చేసుకుందాం”అని కేటీఆర్ అన్నారు.
రైతు కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్
‘‘ఎండాకాలంలో తాగేందుకు నీళ్లు లేకపోతే.. బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో చేసేటోళ్లు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లీ అట్లాంటి పాత రోజులే వస్తయ్. రైతు కష్టం తెలిసిన నాయకుడే సీఎం అయ్యిండు. అందుకే ఇంచు జాగా లేకుండా వరి పంట వేస్తున్నం. పుట్లకొద్ది వడ్లు పండుతున్నయ్.. పంట పెట్టుబడి సాయం, ఫ్రీ కరెంట్, సాగు నీళ్లు, పంట ఉత్పత్తులు కొంటున్నం. అందుకే వ్యవసాయం బాగున్నది”అని కేటీఆర్ అన్నారు. ఒకవైపు రైతు బంధు ప్రభుత్వం ఉందని, మరోవైపు రాబంధు కాంగ్రెస్ ఉందని, ఎవరు కావాలో ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. ‘‘ఎవుసం తెలియని సన్నాసుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి మళ్లీ పాత రోజులు తెచ్చుకుందామా? 50లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. ఈ రోజు నీతి మాటలు మాట్లాడుతున్నడు”అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ గెలిస్తే గోషామహల్‌ను దత్తత తీసుకుంట
హిందువునంటూ రాజాసింగ్ రాజకీయం చేస్తారని, ఆయనకంటే కేసీఆరే పెద్ద హిందువు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, కేసీఆర్ హిందుత్వం పేరుతో రాజకీయం చేయరని తెలిపారు. హైదరాబాద్‌లోని గోషామహల్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించిన కేటీఆర్.. రోడ్‌షోలో మాట్లాడారు. గోషామహల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు చాన్స్ ఇచ్చారని, ఈసారి బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే డిసెంబర్ 3వ తేదీనే గోషామహల్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. విరాట్ కోహ్లీ సెంచరీ, షమీ హ్యాట్రిక్ కొట్టినట్టు కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.