డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. తెలంగాణ అభివృద్ధి చెందుతది: పవన్ కళ్యాణ్

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీతో జనసేన పొత్తులో భాగంగా 2023, నవంబర్ 23వ తేదీ గురువారం కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. 2014లో మోదీని కలిసి, దక్షిణ భారతంలో ఎవరు ఉన్నా.. లేకున్నా..  తాను అండగా ఉంటానని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీరోజూ ఎన్నికల లాగానే పరిస్థితులు ఉన్నాయన్నారు. పరీక్ష పేపర్ లీక్స్ తో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోయారని చెప్పారు. తనకు ఎపి జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చిందని అన్నారు.

అన్ని పార్టీల నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని... కానీ, స్నేహం వేరు.. రాజకీయాలు వేరని... అవినీతిపై పోరాడే వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో  తిరిగానని.. తెలంగాణలో ఉన్న పోరాట స్పూర్తి.. దేశం మొత్తం ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయేదని అన్నారు.  ఈ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా బీజేపికి మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు.