
- కేసీఆర్ నిరంకుశ పాలన పోవాలి
- అందుకు ప్రజా సంఘాలు ఏకం కావాలి: ప్రొఫెసర్ కోదండరాం
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపణ
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన పోవాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తన పదవిని కాపాడుకునేందుకు కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర వనరులను కొల్లగొడుతూ, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన అంతమైతేనే తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగంపెరిగిపోయిందన్నారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సమైక్య సంఘాల ఉమ్మడి మేనిఫెస్టోను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే అందుకు విరుద్ధంగా జరుగుతున్నదన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రజా సంఘాలు నిరాశ, నిసృహలతో ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిర్భందాలు పెరిగిపోయాయని, ఈ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలంటే రాష్ట్రంలోని ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
జైల్లో ఉండాల్సినోళ్లు బయట ఉన్నరు..
అవినీతి తెలంగాణ సర్కార్‌ను ఓడించేందుకు ఎన్నో పోరాటాలు చేస్తున్నామని, ఇందులో అన్ని ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జైళ్లో ఉండాల్సిన వాళ్లు బయట, బయట ఉండాల్సినోళ్లు జైల్లో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగినా కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీని మోదీ సర్కార్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రవళిరెడ్డి, శ్యామల శ్రీను , హర్షవర్ధన్ రెడ్డి , తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.