ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​కు నిరసన సెగ

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​కు నిరసన సెగ

ఆమనగల్లు, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లా ఆమనగల్లు మండలం శంకర్ కొండ తండాలో కల్వకుర్తి ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ప్రచారాన్ని తండావాసులు అడ్డుకున్నారు. మేడిగడ్డ, శంకర్ కొండ తండాల మధ్య మెయిన్​ రోడ్డుపై ఉన్న కత్వవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ప్రచారానికి ఎందుకు వచ్చా వని కాన్వాయ్  ముందు నిరసన తెలిపారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2021లో బ్రిడ్జి నిర్మాణానికి పీఎంజీఎస్ వై పథకం కింద రూ.3.10 కోట్లు మంజూరు కాగా, ఏడాది క్రితం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

కానీ, పనులు ప్రారంభించలేదని, దీంతో తాము వర్షాకాలంలో వాగు ఉధృతి పెరిగితే రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రమాదం అంచున వాగు దాటి ప్రయణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యం చేసుకోగా ఎమ్మెల్యే ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తండావాసులు మళ్లీ అడ్డుకోవడంతో ఆయన  మధ్యలోనే ఆపేసి వెనుదిరగాల్సి వచ్చింది.