- నడిగడ్డలో రెడ్డి వర్సెస్ బీసీ
- గెలుపోటములపై ప్రభావం చూపనున్న బీసీ ఓట్లు
- బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇసుక, మట్టి మాఫియా మరకలు
- అరుణ ఇమేజ్, బోయవాల్మీకి ఓట్ల పైనే బీజేపీ ఆశలు
- కురువ వర్గంతోపాటు ఇతర బీసీల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్
గద్వాల, వెలుగు: గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు ‘రెడ్డి వర్సెస్ బీసీ’గా మారింది. బీజేపీ నేషనల్వైస్ప్రెసిడెంట్ డీకే అరుణ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో అత్త, అల్లుడైన డీకే అరుణ, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నడిచింది. అరుణ లేకపోవడంతో ఈసారి త్రిముఖ పోటీ కనిపిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బరిలో నిలవగా, కాంగ్రెస్‌నుంచి గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, బీజేపీ నుంచి గట్టు మండల పార్టీ అధ్యక్షుడు బలిగెర శివారెడ్డి పోటీ చేస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. రెండోసారి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్అభ్యర్థులు బలాబలాలు బేరీజు వేసుకొంటూ ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్లాన్చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ప్రచారంలో ఎవరికి వారు దూసుకుపోతున్నారు. కురవ సామాజికవర్గానికి చెందిన సరితకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ బీసీ ఓట్లను పోలరైజ్ చేసే పనిలో పడింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన శివారెడ్డి కూడా బీసీ(వాల్మీకి బోయ) కావడంతో పోటాపోటీ నెలకొంది. శివారెడ్డికి డీకే అరుణ ఇమేజ్ కలిసి రానుంది. గద్వాల నియోజకవర్గంలో 2లక్షల53వేల869 ఓటర్లు ఉంటే ఇందులో 70 శాతం మంది బీసీలే. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తామే గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నప్పటికీ, బీసీలు డిసైడింగ్ఫ్యాక్టర్కానున్నారు.
గట్టి పోటీ ఇవ్వనున్న శివారెడ్డి
బీజేపీ అభ్యర్థి బలిగెర శివారెడ్డికి బోయ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా పడితే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కోసం బోయ వర్గానికి చెందిన లీడర్లు కులస్తులను ఏకం చేసే పనిలో పడ్డారు. వీటికి తోడు నియోజకవర్గంలో డీకే అరుణకు ఉన్న ఇమేజ్, క్యాడర్, ఓటు బ్యాంకు శివారెడ్డికి కలిసి రానున్నాయి. డీకే అరుణ కాంగ్రెస్వీడి కమలం గూటికి చేరాక గద్వాలలో బీజేపీ పుంజుకుంది.
బూత్‌స్థాయి నుంచి ఆమె పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. అరుణ పోటీ చేయడం లేదని ప్రకటించాక, కొంత క్యాడర్కాంగ్రెస్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే వేర్వేరు పార్టీల్లో ఉన్న బోయలు కలసికట్టుగా పనిచేయడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది. పైగా కింది స్థాయి బీజేపీ క్యాడర్ శివారెడ్డికి సపోర్ట్ చేయకపోవడం కొంత మైనస్‌గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
మొన్న ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఇచ్చిన హామీని జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారు తనకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలు, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లపై కృష్ణమోహన్ఆశలు పెట్టుకున్నారు. గ్రామస్థాయిలో క్యాడర్ఉండటం, బోయల్లోని ముఖ్య లీడర్లు అండగా ఉండటం కలిసొచ్చే అంశాలు. ఇసుక, మట్టి, సీడ్ మాఫియా మరకలతోపాటు న్యూడ్ కాల్స్ వ్యవహారం ప్రతికూలంగా మారే చాన్స్ ఉంది.
కాంగ్రెస్‌కు చెక్కు చెదరని ఓట్ బ్యాంక్
గద్వాలలో 70 శాతం బీసీలు కాగా ఇందులో 30 శాతం(60 వేలకు పైగా) వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన వారు, 25శాతం(40వేలకు పైగా) కురువ సామాజిక వర్గాని చెందిన ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సరితకు కురువ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే కురువ వర్గానికి చెందిన గోంగళ్ల రంజిత్ కుమార్ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. రంజిత్ కొంతమేర కురువ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. సొంత సామాజిక వర్గంతోపాటు ఇతర బీసీ వర్గాలు సరితకు మద్దతు పలుకుతున్నాయి.
కాంగ్రెస్‌కు ఉన్న స్ట్రాంగ్ఓట్బ్యాంక్, జడ్పీ చైర్ పర్సన్ గా నియోజకవర్గం వ్యాప్తంగా ఆమెకున్న పరిచయాలు కలిసి రానున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ను వీడిన బండ్ల సోదరుల సపోర్టు సరితకు అదనపు బలంగా మారింది. సరిత నాన్‌లోకల్ అని, జడ్పీ చైర్‌పర్సన్‌గా గద్వాల టౌన్‌ను పట్టించుకోలేదని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారం కొంత మైనస్ కావొచ్చు.