నల్గొండ, యాదాద్రి, వెలుగు: బీఆర్ఎస్ ప్రకటించిన స్కీంలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేలిపోవడంతో డబ్బులు కుమ్మరించి గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేసీఆర్ నిన్న హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకున్నడు. తమ స్కీంలను ప్రజలు నమ్మడంలేదని కేసీఆర్‌కు అర్థమైంది. ఈ ఎన్నికల్లో రెండు ఫుల్‌బాటిళ్లు, ఓటుకు పదివేలు ఇస్తే తప్ప ఎన్నికల్లో గెలవలేమని తేలిపోయింది. అధికారుల సపోర్ట్‌తో ప్రభుత్వ వాహనాల్లో డబ్బు సంచులు తరలిస్తున్నారు’’అని అన్నారు.
శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన విజయభేరి సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘పొలాల మీదకు వచ్చే మిడతల దండుకు మందు ఎట్ల పెడ్తమో.. కేసీఆర్‌కు కూడా మందు పెట్టాలే. బీఆర్ఎస్ను మట్టుబెట్టాలే. ఎట్లయినా గెలుస్తమని మీరు ఇండ్ల పండుకుంటే .. ఆడు మాయలోడు.. ఏదైన మాయచేస్తడు. అందరూ మెలకువతో ఉండాలె. దొడ్డి కొమురయ్య లెక్క గుత్పల సంఘం పెట్టండి. పహారా కాయండి. పంచడానికి వచ్చినోడిని పట్టుకోండి. ఉన్నది గుంజుకోండి. బాగుంటే అంగిలాగు కూడా ఇప్పుకోండి. 30 నాడు పోలింగ్ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు పంపించేదాక కాపలాకాయాలి.
అప్పుడు ఈవీఎంల గోల్మాల్ కావు” అని అన్నారు. పైసలు పంచడం కోసం ఓ ఆఫీసర్ ఇంట్లో రూ.వేల కోట్లు దాచిపెట్టాడని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కలా 10వేల ఎకరాలు ఆక్రమించుకుని, లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ఇందిరమ్మ రాజ్యంలో చర్లపల్లి జైలే గతి అని చెప్పారు. ‘ఆయన కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, వస్తే ఎక్కడ ఉంటరు? అందుకే చర్లపల్లి జైలు లో డబుల్ రూమ్ ఇల్లు
కట్టిస్తామని’ అని అన్నారు.
సన్నాసి ఎవడన్నా ఇసుక మీద బ్యారేజీ కడ్తరా..
ఇసుక మీద బ్యారేజీ కట్టడంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని అధికారులు చెప్పారని, ఏ సన్నాసి అయినా రూ. 1.50 వేల కోట్ల విలువైన బ్యారేజీని ఇసుక మీద కడ్తారా అని రేవంత్ మండిపడ్డారు. తన ప్రాంతంలో కాళేశ్వరం, రంగనాయక సాగర్ కట్టుకున్న కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసిండని ఆరోపించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాధించిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పదేళ్ల నుంచి పండబెట్టిండని అన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలు సాగయ్యేదని, ఫ్లోరైడ్ సమస్య తీరేదన్నారు.
నిరుద్యోగులే అసలైన హీరోలు
రెండు లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో కథానాయకులై పని చేస్తే కాంగ్రెస్‌కు కోటి 50 లక్షల ఓట్లు వస్తాయన్నారు. కేసీఆర్ ఇంటినిండా ఉద్యోగాలు వస్తే, ఉద్యమం లో పోరాడిన యువకులకు వంటినిండా గాయాలు మిగిలాయన్నారు. ‘కేసీఆర్ వంద నోటుతో సమానమని, జేబులో దాచుకోవాలని కేటీఆర్ చెప్తున్నడు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ వంద నోటు కాదు.. దొంగనోటు.. ఆ నోటును జేబులో ఉంటే పోలీసులు బొక్కల తోస్తరు’ అని అన్నారు.