- కొండరెడ్ల ఓటింగ్‌పై స్పెషల్ ఫోకస్
- అశ్వారావుపేట నియోజకవర్గంలో 1054 మంది
- ఇందులో 692 మంది ఓటర్లు
- వందశాతం నమోదు చేయించిన ఆఫీసర్లు
- కలెక్టర్‌ను అభినందించిన కేంద్ర ఎలక్షన్ కమిషన్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మారుమూల అడవుల్లో నివసించే కొండరెడ్ల ఓటింగ్‌పై ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల్లోని ఎనిమిది గ్రామాల్లో దాదాపు 692 మంది కొండరెడ్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీరందరు ఓట్లేసేలా కలెక్టర్ ప్రియాంక అలతో పాటు రిటర్నింగ్ఆఫీసర్ పి. రాంబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా మండలాల్లోని గండ్లగూడెం హ్యాబిటేషన్లో 40 కుటుంబాలుండగా 130 మంది నివసిస్తున్నారు. వీరిలో 80 మంది ఓటర్లున్నారు.
సుధగోతులగూడెంలో 30 కుటుంబాలకు 98 మంది జనాభా ఉండగా 63 మంది ఓటర్లున్నారు. నడిమిరెడ్డిగూడెంలో 15 కుటుంబాలకు 58 మంది జనాభా ఉండగా 33 మంది ఓటర్లు, బండారిగుంపులో 26 కుటుంబాలకు 94 మంది జనాభాకు గాను 55మంది ఓటర్లు, రెడ్డిగూడెంలో 92 కుటుంబాలకు 318 మంది జనాభా ఉండగా 238 మంది ఓటర్లు, తిరుమలకుంటలో 28కుటుంబాలకు 85 మంది జనాభా ఉండగా 54 మంది ఓటర్లున్నారు. గోగులపుడిలో 39 కుటుంబాలకు 133 మంది జనాభా ఉండగా 85 మంది ఓటర్లు, పూసుకుంటలో 42 కుటుంబాలకు 138 మంది జనాభా ఉండగా 84 మంది ఓటర్లున్నారు.
రెడ్డిగూడెం గ్రామంలో 318 మంది జనాభా ఉండగా 238 మంది ఓటర్లు ఉండడం విశేషం. పది రోజుల కింద రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్కలెక్టర్ పి.రాంబాబు, అశ్వారావుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్ కొండరెడ్ల గ్రామాల్లో తిరుగుతూ ఈవీఎంల ద్వారా ఓటింగ్ వేసే విధానంపై అవగాహన కల్పించారు. మరోవైపు కొండరెడ్ల గ్రామాల్లో వంద శాతం ఓటర్ల నమోదు కావడంతో ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్‌ను అభినందించింది.