బావా బామ్మర్దుల..సుడిగాలి పర్యటనలు

  • ప్రచారంలో కేటీఆర్, హరీశ్ రావు బిజీబిజీ 
  • గాలిమోటార్లలో జిల్లాలు చుట్టేస్తున్న ఇద్దరు మంత్రులు
  • రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు

వెలుగు, నెట్​వర్క్ :  అక్టోబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీ తరఫున మంత్రులు కేటీఆర్, హరీశ్ రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా బావా బామ్మర్దులిద్దరూ హెలికాప్టర్లలో జిల్లాలను చుట్టేస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అక్కడే బహిరంగ సభల్లో.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించడంతో పాటు కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్​ బలపడుతోందని భావిస్తున్న ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ​ఫోకస్ ​పెట్టారు. తమ పర్యటనల్లో భాగంగా మంత్రులిద్దరూ అసంతృప్త నేతలతోనూ భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు సహకరించాలని బుజ్జగిస్తున్నారు. మొత్తమ్మీద కాంగ్రెస్, బీజేపీ లో ఇంకా క్యాండిడేట్లు తేలకముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. ఆ పార్టీలోని కీలక మంత్రులిద్దరూ ప్రచారంలో బిజీ అయ్యారు. 

కేటీఆర్ షెడ్యూల్ బిజీ.. 

సిరిసిల్ల జిల్లాలో రూ.52.78 కోట్ల అభివృద్ధి పనులకు కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా సీతారాంపురం, చందనవెల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో రూ.1,770 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింటెక్స్, కిటెక్స్ ఇండస్ట్రీ యూనిట్లకు భూమి పూజ చేశారు. 

శుక్రవారం ఉమ్మడి పాలమూరు టూర్​లో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటించిన కేటీఆర్..​ ఆయిల్ ఫామ్ కంపెనీ నిర్మాణానికి మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా టూర్​పెట్టుకున్న ఆయన.. ఖమ్మం సిటీలో రూ.1,370 కోట్లు, సత్తుపల్లిలో రూ.138 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే భద్రాచలంలో రూ.38 కోట్లతో చేపట్టనున్న కరకట్ట పనులకు కొబ్బరికాయ కొడ్తారు. ఇదే క్రమంలో ఆదివారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తారు.

ALSO READ:  తగ్గదేలే.. మంత్రి కేటీఆర్​ బుజ్జగించినా వినలే

చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.250 కోట్లతో చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అదే రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మినీట్యాంక్​బండ్​ఓపెనింగ్​తో పాటు అంతర్గాంలో రూ.60 కోట్లతో ఇండస్ట్రీయల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌కు,  గోదావరిఖనిలో రూ.30 కోట్లతో ఐటీ పార్క్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. రామగుండం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లోనూ రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరిస్తారు. అనంతరం ఇండ్ల పట్టాల పంపిణీ, గృహ లక్ష్మి, పెంచిన వికలాంగుల పింఛన్ల ప్రొసీడింగ్​కాపీలు అందజేసే కార్యక్రమాలనూ పెట్టుకున్నారు. 

ఎక్కువ సెగ్మెంట్లలో పర్యటించాలని హరీశ్ టార్గెట్ 

ఎన్నికల నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను చుట్టిరావాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్​రావు కూడా హెలికాప్టర్ లో జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. గురువారం ఉమ్మడి వరంగల్​జిల్లాలో పర్యటించిన ఆయన.. నర్సంపేట, ములుగులో రూ. 366 కోట్లతో నిర్మించనున్న రెండు మెడికల్ కాలేజీలకు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ, తొర్రూరు పట్టణాల్లో రూ.72 కోట్లతో నిర్మించనున్న 100 బెడ్స్​హాస్పిటల్స్​కు శంకుస్థాపన చేశారు. నర్సంపేటలో రూ.37 కోట్ల 50 లక్షలతో సబ్సిడీ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇక శుక్రవారం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారంలో రూ.101.62 కోట్ల లిఫ్ట్​ఇరిగేషన్ స్కీమ్​తో పాటు వివిధ చోట్ల హాస్పిటల్స్, టెంపుల్స్, కాలేజీలకు శంకుస్థాపన చేశారు. రామన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్​, బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల దిమ్మదిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతున్నదని చెప్పారు.