కాంగ్రెస్​లోకి మరో ఇద్దరు మాజీలు?

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ నుంచి  కాంగ్రెస్​లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరిక దాదాపు ఖరారు కాగా.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి క్యూలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.  వీరిద్దరు బీఆర్ఎస్​ హైకమాండ్​పై నారాజ్​గా ఉన్నట్టు గుర్తించిన కాంగ్రెస్​ పెద్దలు వారితో  సంప్రదింపులు  జరిపినట్టు  ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకరు కాంగ్రెస్​లో చేరేందుకు ఓకే చెప్పారని,  మరొకరు ఇంకా నిర్ణయం తీసుకోలేదని  తెలుస్తోంది. 

వీరి చేరికలపై ఒకట్రెండు రోజుల్లో  క్లారిటీ వచ్చే చాన్సుంది. రెండు నెలల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి  పలువురు బీఆర్ఎస్​ లీడర్లు కాంగ్రెస్​లో చేరారు.  పొంగులేటితో కలిసి కాంగ్రెస్​లోకి వెళ్లిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు తిరిగి సొంతగూటికి చేరి టికెట్​ కూడా దక్కించుకున్నారు. భద్రాచలం నియోజకవర్గ ఇన్​చార్జిగా ఉన్న తనకు తెలియకుండా వెంకట్రావ్​ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం.. నియోజకవర్గ ఇన్​చార్జి బాధ్యతల నుంచి తనను తప్పించడాన్ని  బాలసాని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.  

ఇటీవల ఆయన మంత్రి హరీశ్​​రావును కలిసి తన ఆవేదన చెప్పుకున్నట్టు సమాచారం.  మాజీ మంత్రి తుమ్మలతో బాలసానికి టీడీపీ నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో తనతో పాటు ఆతన్ని కాంగ్రెస్​లోకి తీసుకెళ్లాలని తుమ్మల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు  జరిగితే ఈనెల 16  లేదా 17న   తుమ్మల వెంట బాలసాని కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. 
-