సీపీఐలో పొత్తుల లొల్లి

హైదరాబాద్, వెలుగు: సీపీఐ పార్టీలో పొత్తుల లొల్లి మొదలైంది. పార్టీకి బలమైన సెగ్మెంట్ గా ఉన్న మునుగోడులో పోటీ చేయకుండా, ఏమాత్రం కేడర్​లేని చెన్నూరులో పోటీకి సిద్ధపడటంపై ఆ పార్టీలో అసంతృప్తి రేగింది. మునుగోడులో పోటీ చేయాల్సిందేనని సీపీఐలో ఓ వర్గం పట్టుపడుతుండగా, జాతీయ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని ఇంకోవర్గం వాదిస్తోంది. దీంతో పార్టీ కేడర్​లో అయోమయం నెలకొన్నది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తు నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు కేటాయించేలా సిద్ధమైంది. 

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీపీఐ నేతలకు తెలిపింది. దీనిపై వారం ఇటీవల మగ్దూం భవన్​లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో జాతీయ నేతలు, రాష్ట్ర నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ జాతీయ నేత.. ఆయన కులానికి సంబంధించిన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారనీ, దీనివల్ల పార్టీ కేడర్ ఇబ్బందులు పడుతుంనదని పలువురు నేతలు ఆరోపించినట్టు తెలిసింది. మరోవైపు సీపీఐ నల్లగొండ జిల్లా కమిటీ నేతలు విడిగా సమావేశమై మునుగోడులో పోటీ చేయాలనీ, పార్టీ జిల్లా కార్యదర్శి సత్యంను అభ్యర్థిగా నిలబెట్టాలని తీర్మానించారు. సమావేశంలో జాతీయ నేత కె.నారాయణ తీరుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు.

కాంగ్రెస్​తో చర్చలు జరుగుతున్నయ్...  రెండు సీట్లు ఇస్తమన్నరు: నారాయణ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహనపై చర్చలు జరుగుతున్నాయని, తమకు రెండు స్థానాలు ఇస్తామని జాతీయ కమిటీకి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అందులో ఒకటి కొత్తగూడెం, మరొకటి చెన్నూరు అని పేర్కొన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపార్టీలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయని అలాగే మా పార్టీలో ఉంటాయని చెప్పారు. అయితే అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అందరూ దానికే కట్టుబడి ఉంటారని వెల్లడించారు.

 ‘బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒకే తాను ముక్కలు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఎంఐఎం బయటికి వ్యవహరిస్తుంది, కానీ బీజేపీని గెలిపించేందుకు ఆ పార్టీ శాయశక్తుల కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ కూడా బీజేపీతో లోపాయికారిగా రాజకీయ అవగాహన కుదుర్చుకుంది. లిక్కర్ స్కామ్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసి, కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం’ అని ఆరోపించారు.

ఇయ్యాల మేడిగడ్డకు సీపీఐ బృందం

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు కె.నారాయణ, పార్టీ ​నేతలు అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి నేతృత్వంలో సీపీఐ బృందం గురువారం మేడిగడ్డకు వెళ్లనుంది.