తెలంగాణలో ..ముక్కోణపు పోరు

తెలంగాణలో ..ముక్కోణపు పోరు

పరిమాణం రీత్యా తెలంగాణ పెద్ద రాష్ట్రం కాదు. కేవలం17 ఎంపీ స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం. కానీ దేశంలో ఇప్పుడిది కీలక రాష్ట్రంగా మారింది. హైదరాబాదు రాజధానిగా తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ఆర్థికంగా ముందు నిలబెడుతున్నది. ఇదీగాక వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ధాన్యం కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రధాన ధాన్యం ఎగుమతిదారుగా మారే అవకాశం కూడా ఉంది. రానున్న తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణది ఒక ప్రత్యేక పరిస్థితి. ప్రభుత్వాన్ని నడుపుతున్న ఒక ప్రాంతీయ పార్టీ, అధికారం కోసం పోరాడుతున్న రెండు జాతీయ పార్టీలు గల ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిగతా మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌, బీజేపీ రెండు జాతీయ పార్టీలు మాత్రమే ప్రత్యర్థులుగా ఉన్నాయి. తెలంగాణలో మూడు పార్టీలే ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్​పార్టీ, బీజేపీ, కాంగ్రెస్. ఇక్కడ ఎవరు గెలిచినా వారికి అది చాలా పెద్ద విజయం కిందే లెక్క. ఎందుకంటే అది జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. 

తెలంగాణలో కేసీఆర్ మరోసారి గెలిస్తే ఆయన జాతీయ స్థాయిలో బీఆర్​ఎస్​ను విస్తరించడంతోపాటు తన నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్​చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమిలో అనేక వ్యయ శక్తులు ఉన్నాయి. ఇండియా -కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌  మింగుడుపడటం లేదు. కేసీఆర్ తెలంగాణలో గెలిస్తే..ఆ విజయ దరహాసంతో రంగంలోకి దిగి పెద్దఎత్తున దేశ సమస్యలపై మాట్లాడి తన ఆశయాలను బహిరంగంగా చెప్పుకునే ఆస్కారం ఉంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారొచ్చు కూడా. ఎందుకంటే.. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ నాయకుడి కంటే కేసీఆర్ లాంటి వారికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మొన్నటి కర్నాటక లాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ గెలిస్తే, అది చరిత్రాత్మక విజయం అవుతుంది. 2014లో తన చేతుల్లోంచి కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి పొందినట్లు అవుతుంది. కాంగ్రెస్​తెలంగాణను ఇచ్చిందని ఆ పార్టీ గత రెండు దఫాలుగా చెప్పుకున్నా.. రెండు సార్లు ఆ పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే ఈసారి విజయం కోసం గట్టిగా కొట్లాడుతున్న హస్తం పార్టీ.. తెలంగాణలో గెలిస్తే.. విజయం కాంగ్రెస్‌‌కు ప్రతిష్టను తెచ్చిపెడుతుంది మరియు అది ప్రతిపక్షంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. పైగా, కేసీఆర్‌‌ను గద్దె దించడం ద్వారా కాంగ్రెస్‌‌కు ఇది తీపి ప్రతీకారంగా మారుతుంది. కర్నాటకలో ఓటమి తర్వాత దక్షిణాదిలో బీజేపీకి ఎక్కడా అధికారం లేకుండా పోయింది. అందుకే తెలంగాణలో అధికారంపై బీజేపీ మరింత ఫోకస్​ చేసింది. 2019లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకున్న కాషాయ పార్టీ.. ఈసారి అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలిచి, మునుగోడులో కూడా గట్టి పోటీ ఇచ్చిన ఈ పార్టీకి.. గతం కంటే ఆదరణ పెరిగింది. తెలంగాణలో బీజేపీకి మరింత మెరుగైతే.. 2024 పార్లమెంట్ ఎన్నికలకు అది పెద్ద బూస్ట్ అవుతుంది.

గెలుపు అవకాశాలు

1967 నుంచి భారత రాజకీయాలను పరిశీలిస్తే.. ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీ అధికారం చేజిక్కించుకున్నప్పుడల్లా, కాంగ్రెస్ క్షీణిస్తూ వస్తున్నది. 1967లో డీఎంకే తొలిసారిగా తమిళనాడులో కాంగ్రెస్‌‌ను ఓడించినప్పటి నుంచి అదే పాలన కొనసాగుతోంది. ఒడిశాలో మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్​యాదవ్, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, మాయావతి, పట్నాయక్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు, జార్ఖండ్‌‌లోని గిరిజన నాయకులు సోరెన్​తమ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌‌ను గద్దె దించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఒకే ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్​ఎదురించలేని సందర్భాలు ఉంటే.. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరిగింది. కాబట్టి వాటిని కాదని, మరో జాతీయ పార్టీని తోసిపుచ్చి విజయ తీరాలకు చేరడం అంత సులభమేమీ కాదు. కానీ సమష్టి నాయకత్వంతో అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి.. ప్రత్యామ్నాయం మేమే అనే భరోసా ఇస్తే.. కర్నాటక లాగా ఇక్కడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 

బీజేపీకి ఎమ్మెల్యేలు పెరగాలి

2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ తెలంగాణలో అద్భుతంగా ఎదిగిందనడంలో సందేహం లేదు. 2019లో బీజేపీకి 4 ఎంపీలు, 20 శాతం ఓట్లు వచ్చాయి. సాధారణంగా చరిత్రలో చూస్తే.. బీజేపీ ఎక్కడైనా అధికారం చేజిక్కించుకోవాలంటే 20 ఏళ్ల పాటు శ్రమించి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ పార్టీ వేగంగా ఎదుగుతున్నది. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావాల్సినంత ఎమ్మెల్యేలను గెలిపించుకుని కేసీఆర్‌‌కు మెజారిటీ రాకుండా ఆపగలిగితే అదే గొప్ప విజయం. మహాభారత యుద్ధంలో గొప్ప యోధుడు దుర్యోధనుడు ఓడిపోయాడు. ఆయన ఒక సరస్సులో దూకి దాక్కున్నాడు. కాంగ్రెస్‌‌, కేసీఆర్‌‌లు ఓడిపోతే కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓడిపోయిన నాయకులు హైదరాబాద్‌‌లోని హుస్సేన్ సాగర్‌‌లో దుర్యోధనుడిలా దాక్కోవాలని నా ఉద్దేశంకాదు. వారు చాలా ఇబ్బంది పడతారనేది సారాంశం. 

బీఆర్ఎస్​ పార్టీకి..

తెలంగాణలో కేసీఆర్‌‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ధరణి భూ కుంభకోణాలు, ప్రాజెక్టుల్లో కమీషన్లు వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముక్కోణపు పోటీలో బీజేపీ, కాంగ్రెస్‌‌లు పరస్పరం పోట్లాడుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. కేసీఆర్‌‌కు మేలు జరగొచ్చు. ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని ఈ మధ్య జనసేన అధినేత చెప్పాడు. ఇలా కలిసి వెళ్లడం వైసీపీ అధినేత జగన్మోహన్‌‌రెడ్డికి సవాలే.. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. అయితే కేసీఆర్​కు సొంతంగా మెజారీటీ రావాలి. లేదా హంగ్​పరిస్థితి వస్తే.. మిత్రపక్షం ఎలాగూ ఉంది కదా. కేసీఆర్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోగలిగేది ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్‌‌ అపూర్వ విజయమే. 

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్