తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలక, ప్రతిపక్ష పార్టీలు ధరణి వేదికగా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో మాన్యువల్ భూ రికార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయని రెవెన్యూలో వీఆర్వో వ్యవస్థ వల్ల పైరవీలకు తావు ఉందని, పహాణీలు తారుమారు అవుతున్నాయనే అభియోగంతో వీఆర్వో వ్యవస్థను, 1971లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేసింది. 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకువచ్చి భూ రికార్డులను ధరణి పోర్టల్ లో నిక్షిప్తం చేసి ధరణి పోర్టల్ లో నమోదై పాసుపుస్తకాలున్న రైతులకు రైతుబంధు, చనిపోయిన రైతులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు బీమా పథకం కింద ఐదు లక్షలు జమ చేస్తుందని, ధరణి వల్ల 90 శాతం పైగా భూ సమస్యలు తీరాయని ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ధరణి పోర్టల్ వల్ల గ్రామాల్లో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, భూరికార్డులకు, క్షేత్రస్థాయిలోని భూమికి సంబంధం ఉండటం లేదని, ఈ పోర్టల్ ను రద్దు చేసి నూతన వ్యవస్థకు శ్రీకారం చుడతామని ప్రకటిస్తున్నాయి.
ఆదివాసీల అవస్థలు
ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల భూ సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిజాం కాలంలో వచ్చిన పట్టా భూములు, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్మెంట్/లావుని, ప్రభుత్వ, పోడు భూములను ఈ ప్రాంతంలోని రైతులు సాగు చేసుకుంటున్నారు. ఏజెన్సీల్లో చాలా ఆదివాసి గ్రామాలు 1950 నుంచి 54 మధ్యకాలంలో రజాకార్ల ఆగడాలను తట్టుకోలేక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లి గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామాల్లో అసలైన పట్టా భూములు నేడు అడవి పెరిగి అటవీ భూములుగా ధరణి రికార్డుల్లో నమోదయ్యాయి. ఒకవేళ అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టా భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ నేటికీ వారి తాతలు, తండ్రుల పేర్ల మీదనే భూ రికార్డులు కనిపిస్తున్నాయి. భూములు తమ పేరు మీద లేకపోవడం, పేర్లు, తమ వివరాలు తప్పుగా నమోదవడం, విస్తీర్ణం తక్కువగా నమోదవటం, భూమి స్వభావం, భూమి వచ్చిన విధానంలో తేడాలు ఉండటం, పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరిపోవటం, ఒకరి పేరు మీద భూమి మరొకరి పేరు మీద నమోదు కావటం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా భూముల అమ్మకాలు, కొనుగోలు సాదాబైనామా(తెల్ల కాగితాల) ద్వారానే జరిగాయి. కానీ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల అమ్మిన వ్యక్తుల పేర్ల మీదనే నేటికీ భూముల రికార్డులున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ ప్రాంత రైతులు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో కుదువ పెట్టి క్రాప్ లోన్లు తీసుకున్నారు. కొంతమంది తమకు అవగాహనా రాహిత్యం వల్ల క్రాప్ లోన్లు మాఫీ అయినా, కాకున్నా నేటికీ ఆ భూ పట్టాలు బ్యాంకుల్లో ఉండటం వల్ల తమ భూముల సర్వే నంబర్లు తమకు తెలియకుండా సాగులోనే ఉంటూ నేటికీ ఆ భూములకు రికార్డులు, పట్టాలు, పాసుబుక్కులు లేవు. భూమిశిస్తులు కట్టిన సర్వే నెంబర్లు ధరణిలో కనిపించటం లేదు.
గిరిజనేతరుల పేర్లు..
ఏజెన్సీ ప్రాంతంలో గత ప్రభుత్వాలు వారికి ఇచ్చిన అసైన్మెంట్/ లావుని పట్టా భూములు అటవీ, రెవెన్యూ హద్దు వివాదం వల్ల నేడు అటవీ భూములుగా నమోదయ్యాయి. ఆదివాసీలకు పట్టాలు ఉన్నా కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆదివాసి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లు, టైగర్ జోన్ లు, ప్రాజెక్టులు, కాలువలు, రోడ్ల పేరుతో చాలా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం భూ సేకరణ చేసి, నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. ఈ ప్రాంతంలో గిరిజనుల భూముల రక్షణ కోసం ఎల్టీఆర్1959(1/70) చట్టం ఉన్నప్పటికీ యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతున్నది. ఈ ప్రాంత గిరిజనుల భూములకు ఎల్టీఆర్ జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినా కూడా నేటికీ వారి స్వాధీనంలో భూమి లేదు. 2010 నుంచి 2020 మధ్య కాలంలో రికార్డులను కంప్యూటరీకరణ చేసే క్రమంలో గిరిజనుల భూ రికార్డుల్లోకి వలస గిరిజనులు, గిరిజనేతరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో బిల్ మక్త భూములు ఈ ప్రాంత రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. వీటికంటూ ప్రత్యేక సర్వే నెంబర్లు ప్రభుత్వ గుర్తింపు అంటూ లేకుండా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2005లో కోనేరు రంగారావు ఆధ్వర్యంలో గిరిగ్లాని కమిటీ ఏజెన్సీ ప్రాంత భూములపై అధ్యయనం చేసి అనేక సూచనలు, సలహాలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందుకు అనుగుణంగా అనేక సర్క్యులర్లు,జీవోలు ప్రభుత్వం తీసుకు వచ్చినా అమలుకు నోచుకొక అవన్నీ మరుగునపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు.
శాశ్వత పరిష్కారం చూపాలి
ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఎమ్మార్వో, ఆర్డీవో నుంచి మొదలు కలెక్టర్ వరకు ఏజెన్సీ ప్రాంత చట్టాలపై అవగాహన లేక, అవగాహన ఉన్నా నిబద్ధత, చిత్తశుద్ధి లేక రాజకీయ ఒత్తిడితో ఏజెన్సీ భూములను, భూ చట్టాలను కాపాడలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నడుస్తున్న ఆర్డీవో/ ఎస్ డీసీ కోర్టులు, ఐటీడీఏ పీవో, ఏజెంట్ టు ది గవర్నమెంట్ రెవెన్యూ కోర్టులు సరిగా నిర్వహించక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏజెన్సీ ప్రాంత రెవెన్యూ కోర్టులపై శ్రద్ధ చూపడం లేదు. ఇలా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు దరిచేరని ధరణిగా అనేక భూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని భూమి ఉండి పట్టాలు లేక పండిన పంటను దళారుల చేతిలో పెట్టి గిట్టుబాటు లేక, రైతుబంధు, పంట నష్టపరిహారం, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద లబ్ధి, రైతుబీమాలు ఈ ప్రాంత ప్రజలు పొందలేకపోతున్నారు. ఆదివాసీ ప్రాంతంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీ గ్రామం అయిన పుట్టలభూపతి, పాకాల కొత్తగూడం మండలం, మహబూబాబాద్ జిల్లాలో భూ చట్ట న్యాయ నిపుణులు భూమి సునీల్ కుమార్ కృషితో గ్రామ రెవెన్యూ భూములు 99 శాతం భూ రికార్డులు సక్రమంగా ధరణిలో నమోదై ప్రభుత్వ లబ్ధి పొందుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలు తీరాలంటే ఈ గ్రామంలో జరిగినట్లుగా రైతులకు భూమి రికార్డులపై అవగాహన కల్పించి, ప్రజల భాగస్వామ్యంతో ధరణిలో ఉన్న తప్పులను గుర్తించి రికార్డులను సరిచేసుకుంటూ ఏజెన్సీ చట్టాలను, కోర్టులను పటిష్టం చేసి ఏజెన్సీ ప్రాంత ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
రికార్డులను సరిచేయకపోవడం వల్ల..
వాస్తవానికి నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో 1930–40 కాలంలో భూమి శిస్తు కోసం భూమి రికార్డులు మొద లయ్యాయి. తెలంగాణ ప్రాంతం రాజుల పాలనలో ఉండటం వల్ల తమ కింద పని చేసిన మంత్రులు, దొరలకు వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాల వరకు భూములు ఇచ్చారు. ఆ మధ్యకాలంలోనే భూముల సర్వే జరిగి మొదటి భూ రికార్డు సేత్వర్ రూపొందిం చారు. తెలంగాణలో అనేక రైతాంగ భూ పోరాటాలు జరిగాయి. వాటి ఫలితంగా భూస్వాముల నుంచి పేద లకు భూముల పంపిణీ జరిగింది. 1940 నుంచి 2020 వరకు ప్రభుత్వాలు భూ ములు పంపిణీ చేస్తూ, భూ సర్వే చే యకుండా, భూ మార్పిడి, భూ రికార్డులు, భూ చట్టాలు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థ లోపం, ప్రజలకు భూ చట్టాలపై అవగాహన లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా భూములు, భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని కంప్యూటరీకరణపేరుతో రికార్డులను సరిచేయకుండా ధరణిలో నిక్షిప్తం చేయడం వల్ల భూసమస్యలు కోకొ ల్లలుగా పేరుకుపోయాయి.
‑ వాసం ఆనంద్ కుమార్, అడ్వకేట్