ఇదెట్టా..? వయస్సు 44 ఏండ్లు...కానీ ఓటర్ ఐడీలో మాత్రం 123 ఏండ్లు..

ఇదెట్టా..? వయస్సు 44 ఏండ్లు...కానీ  ఓటర్ ఐడీలో మాత్రం 123 ఏండ్లు..

ఎన్నికల సంఘం అధికారుల లెక్కలు అమోఘం..అద్భుతం. అనిర్వచనీయం. తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం అధికారుల నిర్వాహకాన్ని చూస్తే వాహ్వా..! వాహ్వా..!  అనక తప్పదేమో. ఎందుకంటే వారు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేము. ఇంతకీ వారు చేసిన అమోఘమైన పనేంది అనుకుంటున్నారా..? 

ఇటీవలే ఎన్నికల సంఘం కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా చాలా మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. కొందరు మిస్ అయిన ఓటర్లు కూడా మళ్లీ తమ ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన కోడెపాక కోటిలింగం, కోడెపాక పద్మ కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓటర్ ఐడీ కార్డు మంజూరు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. అయితే అందులో వీరి వయస్సు 44, 42కు బదులు ఏకంగా 100 ఏండ్లకు పైగా వేశారు. 

కోడెపాక కోటిలింగం వయస్సు 44 సంవత్సరాలు.., కోడెపాక పద్మ వయస్సు 42 సంవత్సరాలు. కానీ వీరి వయస్సును ఎన్నికల సంఘం అధికారులు 123 సంవత్సరాలుగా నిర్థారించారు. వీరిద్దరి పుట్టిన రోజును 1-1-1900గా ఓటర్ ఐడీ కార్డులో వేశారు. తమ వయస్సను 123 సంవత్సరాలుగా నిర్థారించడంపై  కోటిలింగం, పద్మ  షాక్కు గురయ్యారు. తమ ఓటర్ ఐడీ కార్డులో పుట్టిన రోజును సరిచేసి సరైన వయస్సును వేయాలని బాధితులు కోరుతున్నారు.