ఖమ్మం కాంగ్రెస్ టికెట్..రేసులో కొత్త ముఖాలు! 

  •     ప్రచారంలో పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు
  •     భట్టి విక్రమార్క సపోర్టుతో సిటీ అధ్యక్షుడు జావేద్​ప్రయత్నాలు
  •     తన అనుచరుడు విజయ్ బాబును ప్రమోట్ చేస్తున్న పొంగులేటి
  •     రేణుకా చౌదరి సపోర్టుతో రాధాకిశోర్ రిక్వెస్టులు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోయే కాంగ్రెస్​అభ్యర్థుల లిస్ట్ రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా మరికొంత మంది పేర్లు బయటకు వస్తున్నాయి. నిన్నటి వరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఎవరో ఒకరు ఖమ్మం బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే తుమ్మల కాంగ్రెస్​లో చేరిక, షర్మిల పార్టీ విలీన ప్రక్రియ ఆలస్యం అవుతుండడం, కమ్యూనిస్టులతో పొత్తుల అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో తాజాగా మరికొంత మంది కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ, టికెట్ పై ఆశలు పెట్టుకున్న లీడర్లు తమ గాడ్ ఫాదర్ల ద్వారా ఒకవైపు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మం సీటును మైనార్టీలకే కేటాయించాలని ఇటీవల కొందరు ముస్లింలు డిమాండ్ చేశారు. అదే సమయంలో తన అనుచరుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబును పొంగులేటి ప్రమోట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆయన్ను తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారుతోంది. 

మెజార్టీ సీట్లే లక్ష్యంగా ప్లాన్

2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను 8 సీట్లు కాంగ్రెస్​కూటమి గెలుచుకుంది. ఈసారి కూడా మెజార్టీ సీట్లు సాధించాలంటే బలమైన నేతలను బరిలోకి దించాలని ప్లాన్​చేస్తోంది. ఇందులో భాగంగా పొంగులేటిని పాలేరు నుంచి, తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయించే యోచనలో ఉంది. కమ్యూనిస్టులతో పొత్తులు ఇంకా ఫైనల్​ కాకపోవడంతో వాళ్లకిచ్చే సీట్ల విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి కొత్తగూడెం నుంచి పొంగులేటి లేదా జలగం వెంకట్రావు పార్టీలో చేరితే ఆయనకు ప్రాధాన్య ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. అయితే ఖమ్మం నుంచి తన అనుచరుడు మువ్వా విజయ్ బాబు రంగంలోకి దించేందుకు పొంగులేటి ప్లాన్​చేస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కు టికెట్ ఖాయం కాగా, ఆయనపై అదే కమ్యూనిటీకి చెందిన తుమ్మలను దించాలని కాంగ్రెస్​భావించినా, అందుకు తుమ్మల సానుకూలంగా లేరు. అదే సామాజికవర్గానికి చెందిన విజయ్​బాబును పోటీ చేయించాలని పొంగులేటి భావిస్తున్నారు. బుధవారం నుంచి గడప గడపకు కాంగ్రెస్​ప్రచార కార్యక్రమాన్ని ఖమ్మంలో ఆయన ప్రారంభిస్తున్నారు. మువ్వా విజయ్​బాబు బర్త్ డే(సెప్టెంబర్​6న)ను ఏటా సత్తుపల్లిలో నిర్వహిస్తుండగా, ఈసారి ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ ఆఫీసులో ప్లాన్​చేయడం అందుకు బలం చేకూరుస్తోంది. గడప గడపకు కాంగ్రెస్​కార్యక్రమంతో విజయ్ బాబును ఖమ్మం అభ్యర్థిగా ప్రమోట్ చేయడమే పొంగులేటి వ్యూహమని పార్టీలో చర్చ జరుగుతోంది.  

9 మంది అప్లికేషన్లు 

ఖమ్మం టికెట్ కోసం గాంధీభవన్​లో మొత్తం 9 మంది అప్లికేషన్లు ఇచ్చారు. వీరిలో ఒకరైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడైనా పోటీ చేస్తానంటూ అప్లికేషన్​పెట్టుకున్నారు. ఆయన వెంట పార్టీలో చేరిన మాజీ డీసీసీబీ చైర్మన్​మువ్వా విజయ్​బాబు కూడా ఖమ్మం, లేదా పాలేరులో పోటీకి సిద్ధమని అప్లై చేసుకున్నారు. ఇక మిగిలిన దరఖాస్తుదారుల్లో ఖమ్మం నగర కాంగ్రెస్​అధ్యక్షుడు మహ్మద్​జావేద్, మాజీ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిశోర్, ఇతర నేతలు పరుచూరి మురళీకృష్ణ, లోకేశ్​యాదవ్, చోటాబాబు, నున్నా రామకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం ఉన్నారు.

ఇందులో జావేద్ మంగళవారం కాంగ్రెస్​స్క్రీనింగ్ కమిటీ చైర్మన్​మురళీధర్, కమిటీ సభ్యుడు మహ్మద్​సిద్దిఖీని కలిసి, తనకే టికెట్ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.1990 లో ఎన్ఎస్ యూఐలో చేరిన ఆయన ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేసినట్టు వివరించారు. సీఎల్పీ నేత భట్టి సపోర్టుతో జావేద్​టికెట్ ఆశిస్తుండగా, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సపోర్టుతో మానుకొండ రాధాకిశోర్​కూడా రేసులో ఉన్నారు.