కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ప్రజలు నమ్మరు..మునుగోడు నుంచే పోటీ చేస్తా

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను  బిజెపి అభ్యర్థిగా  మునుగోడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 2023 అక్టోబర్ 15వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రవేట్ కార్యక్రమంలో  రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వచ్చే ఎన్నికల్లో తాను బిజెపి పార్టీ నుండి మునుగోడులో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో కెసిఆర్ కౌరవ  సైన్యంపై నైతిక విజయం మునుగోడు ప్రజలు తనకు అందించారన్నారు.  

ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు  వచ్చినా మునుగోడు ప్రజలు 87 వేల ఓట్లు వేసి నైతిక విజయాన్ని  ఇచ్చారు.  ప్రజలకు అండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండే  పోటీ చేసి గెలుస్తానని చెప్పారు.  కొందరు కుట్ర పూరితంగా కావాలని తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని మండిపడ్డారు.  కెసిఆర్, రేవంత్ రెడ్డి లను తెలంగాణ ప్రజలు నమ్మరని.. బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలే ఒక్కటేనని అన్నారు.  2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆరెస్ పార్టీలో చేరారని.. ఇప్పడు కూడా అదే జరుగుతదని, ప్రజలు మరోసారి ఈ రెండు పార్టీల చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

ALSO READ : ప్రభాస్ స్టిల్స్ లీక్.. వింటేజ్ లుక్లో డార్లింగ్