- ఎవరికి టికెట్ వస్తుందో తెలియక టెన్షన్
- టికెట్ వచ్చేదాక వెయిట్‌చేయాలని ఆలోచన
మెదక్, వెలుగు:మెదక్, నర్సాపూర్ స్థానాలనుంచి కాంగ్రెస్, బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతలు డైలమాలో ఉన్నారు. ఈ రెండు చోట్ల ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశం దక్కనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారితో పాటు కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం ఈ పరిస్థితికి కారణం. టికెట్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ధీమాగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యక్రమాలు నిర్వహించిన లీడర్లు ఇప్పటి నుంచే ఖర్చు పెట్టడం ఎందుకని స్పీడ్ తగ్గించారు. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ముందువెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు.
భారీగా ఆశావహులు
మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 12 మంది దరఖాస్తు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బాలకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత్ రావ్, డీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు తదితరులు ఉన్నారు. బీజేపీ టికెట్ కోసం జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజశేఖర్, నందు జనార్ధన్ రెడ్డి, కరణం పరిణీత, అధికార ప్రతినిధి నందారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాంచరణ్ యాదవ్, అడ్వకేట్ సుభాష్‌చంద్రగౌడ్, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ దరఖాస్తు చేశారు.
నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, నాయకులు రవీందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. బీజేపీ టికెట్ కోసం నర్సాపూర్ మున్సిపల్చైర్మెన్ మురళీ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేశ్ గౌడ్, సీనియర్ నాయకులు రఘువీరా రెడ్డి, పాపగారి రమేశ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు.
హైకమాండ్ చుట్టూ చక్కర్లు
రెండు పార్టీల్లోనూ టికెట్ పోటీ తీవ్రంగా ఉంది. ఎవరికి వారే తమ గాడ్ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఇటీవల బీజేపీకి రిజైన్ చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో తనకు కాంగ్రెస్ పెద్దలతో ఉన్న పరిచయాల మేరకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ కూడా కాంగ్రెస్ టికెట్‌కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ తన సామాజిక వర్గానికే చెందిన బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను నమ్ముకున్నట్టు తెలుస్తోంది. నర్సాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలతో టచ్ ఉంటున్నారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మెన్ మురళీ యాదవ్ టికెట్బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో.. ఎవరికి అవకాశం వస్తుందో అన్న సస్పెన్స్ పార్టీ నేతల్లో కొనసాగుతోంది.
నర్సాపూర్ బీఆర్ఎస్లో సైలెన్స్
115 సెగ్మెంట్లకు క్యాండేట్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ అభ్యర్థిని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. నెలరోజులవున్నా క్యాండేట్‌ను ఫైనల్ చేయకపోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ఇక్కడ సిటింగ్‌ఎమ్మెల్యే మదన్‌రెడ్డితోపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇంకొకకరిని ఒప్పించడం పెద్ద కష్టమైన పనికాదని, కానీ ఎందుకు ఇంతలా డిలే చేస్తున్నారో అర్థం కాక లీడర్లు, కార్యకర్తలు అయోమయం చెందుతున్నారు. మరోవైపు దీంతోపాటు పెండింగ్ పెట్టిన జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
వారిద్దరినీ శుక్రవారం ప్రగతిభవన్‌కు పిలిచి మాట్లాడిన మంత్రి కేటీఆర్ పల్లాకు టికెట్ ఇచ్చేలా ముత్తిరెడ్డిని ఒప్పించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఒకటి, రెండు రోజుల్లో నర్సాపూర్ ఇష్యూ ను సైతం సెట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. కానీ మదన్‌రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలేదు అంటున్నారు. తాను పబ్లిక్ మనిషినని, నిజాయతీగా పనిచేసే తనను పక్కనపెడ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మదన్‌రెడ్డి అంటున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో పోటీచేసుడు పక్కా అంటున్నారు. అదే సమయంలో సునీతారెడ్డి కూడా తనకు టికెట్ఇచ్చేందుకే మదన్‌రెడ్డి పేరును ప్రకటించలేదని చెప్తున్నారు. జనగామ ఇష్యూను పరిష్కరించినట్లే ఒకటి, రెండు రోజుల్లో నర్సాపూర్ టికెట్సంగతినీ తేల్చేస్తారనే చర్చ జరుగుతోంది. వెయిట్ అండ్ సీ.