కాంగ్రెస్​ వైపు మండవ చూపు! ..జిల్లా పాలిటిక్స్ ను శాసించిన లీడర్​గా గుర్తింపు

  • కేసీఆర్​ ఇంటికొచ్చి బీఆర్ఎస్​లో చేర్చుకున్నా.. దక్కని ప్రాధాన్యం
  • నాలుగున్నరేండ్ల నుంచి సైలెన్స్​​
  • తుమ్మల నాగేశ్వరరావు వెంట హస్తం గూటికి చేరే ఆలోచన

నిజామాబాద్, వెలుగు: అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇరవై ఏండ్లకు పైగా టీడీపీ జిల్లా పాలిటిక్స్​ని శాసించిన నిజామాబాద్​ రూరల్ ​నేత మండవ వెంకటేశ్వర​రావు కాంగ్రెస్​వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్​లో గుర్తింపులేక నాలుగున్నరేండ్ల నుంచి సైలెంట్​గా ఉన్న ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన తన దగ్గరి బంధువు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా హస్తంలో చేరడానికి ముహుర్తం ఫిక్స్​చేసుకున్నట్లు తెలుస్తోంది. మండవ వస్తే జిల్లాలో కాంగ్రెస్​మరింత బలపడుతోందని, ఎన్నికల నేపథ్యంలో కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. 

తుమ్మల సలహాతో..

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మండవ వెంకటేశ్వరరావుకు దగ్గరి బంధువు. తుమ్మల కాంగ్రెస్​లో చేరుతారనే సంకేతాలు కనపడుతుండగా, జిల్లా నుంచి మండవను చేరమని సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మండవకు టీపీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్​రెడ్డి సైతం నాలుగు రోజుల కింద హైదరాబాద్​లో మండవను కలిసి కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మండవ ఎలక్షన్​ టైమ్​లో పార్టీలో చేరితే అదనపు బలం అవుతుందని కాంగ్రెస్​ స్టేట్​లీడర్లు భావిస్తున్నారు.

అధికార పార్టీలో దక్కని ప్రాధాన్యం..

2014 తర్వాత యాక్టివ్​ పాలిటిక్స్​కు దూరమని మండవ తన క్యాడర్​కు సంకేతాలు ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నేతలు మండవ అనుమతితో ఇతర పార్టీల్లో చేరారు. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి  బీఆర్ఎస్​లో చేర్చుకున్నారు. స్తబ్దుగా ఉన్న మండవకు మళ్లీ తన పొలిటికల్ ​లైఫ్ ను స్టార్ట్​ చేస్తారని ఆయన వర్గీయులు భావించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఆయనకు దక్కుతుందని ప్రచారం జరిగింది. లోక్​సభ ఎలక్షన్​లో కవిత పోటీ చేయగా, మండవ సామాజికవర్గం ఓట్లు పొందేందుకే ఆయనను ప్లాన్ ​ప్రకారం పార్టీలో చేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇందుకు తగ్గట్లే లోక్​సభ ఎన్నికల్లో కవిత ఓటమి అనంతరం సీఎం కేసీఆర్​ మండవ వైపు తొంగిచూడలేదు. బీఆర్ఎస్​లో తనకు ప్రాధాన్యం లభించడం లేదనే  ఆలోచనతో ఉన్న మండవ, తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అజాత శత్రువు మండవ..

వెంకటేశ్వరరావు 1985, 89, 94, 99 ఎన్నికల్లో డిచ్​పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా వరుస విజయాలు అందుకున్నారు. 2004లో ఒక్కసారి ఓడినా, తిరిగి 2009 నిజామాబాద్​ రూరల్​ నుంచి పోటీచేసి విన్నయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఎక్సైజ్, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 వరకు జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు తోడు రాజకీయ పరిస్థితుల కారణంగా 2014 తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి సైలెంట్ అయిన మండవకు అజాత శత్రువుగా పేరుంది.