ఇవి పైసలా..? చిత్తు కాగితాలా..? పోలీసుల తనిఖీల్లో లక్షల్లో నగదు పట్టుబడుతోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి..అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు..బంగారం, వెండిని స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్లో పోలీసులు రూ. 16 లక్షలు పట్టుకున్నారు.
కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ ఏరియాల(ముకరంపుర)లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 16 లక్షల నగదు పట్టుకున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వాహనంలో వెళ్తుండగా..అతన్ని విచారించారు. దీంతో అతని దగ్గర రూ. 16 లక్షల 69 వేల 940 నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. డబ్బులు తీసుకెళ్తున్న తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన కళ్యాణ్గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును విచారణ అనంతరం బిల్లుల ప్రకారం అతనికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.