రూ. 3 కోట్ల నగదు...ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

నల్లగొండ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఓ వాహనం నుంచి ఏకంగా రూ. 3.04 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నగదును సీజ్ చేసిన పోలీసులు..అక్రమంగా డబ్బును తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. 

ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  ఈదులుగూడ  సిగ్నల్‌ దగ్గర ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. అయితే ఓ కారు ఈ చెక్ పోస్టు దగ్గర ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో ఆ వెహికిల్ ను పోలీసులు వాడపల్లిలో పట్టుకుని తనిఖీ చేయగా..అందులో రూ. 3.04 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. 
కారులో అక్రమంగా నగదు తరలిస్తున్న  విపుల్ కుమార్ భాయ్,  అమర్‌సిన్హ్ జాలా అనే ఇద్దరిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. 

నల్గొండ జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో  అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి..అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఎస్పీ అపూర్వారావు తెలిపారు. ఓటర్లను  ప్రభావితం చేసే నగదు,మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి  ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయని చెప్పారు.  ఇప్పటి వరకు 2800 మందిని బైండవర్ చేశామన్నారు. తనిఖీల్లో  ఇప్పటి వరకు రూ. 7.39 కోట్ల నగదు, 40 లక్షల విలువగల మద్యం, 1.71 కోట్ల విలువ గల గంజాయి,80 లక్షల విలువ గల గోల్డ్ పట్టుకున్నట్లు ఎస్పీ అపూర్వారావు వెల్లడించారు. 

ALSO READ : బీఆర్ఎస్ మేనిఫెస్టోను చింపేసిన అర్వింద్