
కోల్‌బెల్ట్, వెలుగు : బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తరపున ప్రచారానికి వెళ్లిన నేతలు, అనుచరులకు స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామంలో బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన కళాకారుల ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే సుమన్ ఐదేండ్లుగా తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించలేదని వారు మండిపడ్డారు. గ్రామంలో ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రాలేదని ఫైర్ అయ్యారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మండిపడ్డారు.ఎందుకు వచ్చారని, వెంటనే వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్‌ను ఓడిస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, యువకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో నేతలు, కళాకారులు తమ ప్రచార రథంలో వెనక్కి వెళ్లారు.