మహిళలకు సీట్లు దక్కేనా? ఎన్నికల్లో పోటీకి మహిళల ఆసక్తి

మహిళలకు సీట్లు దక్కేనా? ఎన్నికల్లో పోటీకి మహిళల ఆసక్తి
  •  బీఆర్ఎస్​లో ఒక్కరికే పరిమితం 
  • కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీకి సై
  • టికెట్​ కోసం మహిళా లీడర్ల పైరవీలు

కోల్​బెల్ట్, వెలుగు:  ఆదిలాబాద్​ ఉమ్మడి  జిల్లా నుంచి  పలువురు మహిళలు అసెంబ్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అవకాశం కల్పిస్తే సత్తాచాటుతామంటున్నారు. అయితే ప్రతిసారీ ప్రధాన పార్టీలు ఛాన్స్​ ఇవ్వకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.   పది అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్​ కేవలం ఒక్కరికి టికెట్​కన్​ఫాం​ చేయగా మరొక సిట్టింగ్ ఎమ్మెల్యేకు  మొండిచేయి చూపింది. కాంగ్రెస్​, బీజేపీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాంగ్రెస్​ నుంచి సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో మహిళలకు ఏ మేరకు ఛాన్స్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు.  

ఒకరికి ఇచ్చి మరొకరికి మొండిచేయి…

ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​కేవలం  ఒక మహిళకు మాత్రమే  పోటీ చేసే చాన్స్​కల్పించింది. ఆసిఫాబాద్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే అత్రం సక్కుకు మొండిచేయి చూపిన అధిష్టానం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్​​ కోవ లక్ష్మికి టికెట్​ కేటాయించింది. మరోవైపు ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్​ను పక్కన పెట్టి మంత్రి కేటీఆర్​కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్​కు టికెట్​ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్​ తనకు టికెట్​ఇవ్వనప్పటికీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే  రేఖానాయక్​ ప్రకటించారు. ఆమె కాంగ్రెస్​నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. 

బెల్లంపల్లి నుంచి అత్యధికుల ఆసక్తి

సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి అసెంబ్లీ  ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నలుగురు మహిళా లీడర్లు దరఖాస్తు చేసుకున్నారు.  పార్టీ మహిళ విభాగం స్టేట్ సెక్రటరీ,  రెండుసార్లు కౌన్సిలర్​గా పనిచేసిన రొడ్డ శారద, మూడుసార్లు  ఉమ్మడి జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన చొప్పదండి భవానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. స్టేట్​ఎస్సీ సెల్​ కో కన్వీనర్ గా పనిచేసిన గద్దల హైమావతి, మాజీ ఎమ్మెల్యే దాసరి నర్సయ్య బంధువు దాసరి విజయ ఎమ్మెల్యే టికెట్​ కోసం తమ దరఖాస్తులను కాంగ్రెస్​ అధిష్టానానికి అందజేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంకా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్​ నిర్ణయం మారక పోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. చెన్నూరు ఎస్సీ రిజర్వు స్థానంలో కాంగ్రెస్​నుంచి సింగరేణి డిస్మిస్​ కార్మిక సంఘం వ్యవస్థాపకులు రామిల్ల రాయలింగు కూతురు రామిళ్ల రాధిక, కాంగ్రెస్ అనుబంధ​ డాక్టర్ సెల్ స్టేట్​ కో కన్వీనర్​ డాక్టర్​ దాసారపు శ్రీనివాస్ తో పాటు ఆయన  సతీమణి డాక్టర్​ దాసారపు విద్యావర్థిని కూడా ఎమ్మెల్యే టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బీజేపీ నుంచి పలువురు

బీజేపీ నుంచి పలువురు మహిళలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్​ నియోజకవర్గం  నుంచి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సుహాసినీ రెడ్డి, ముధోల్ సెగ్మెంట్ నుంచి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవి టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్ నుంచి జానకీ బాయి, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి సైతం  బీజేపీ టికెట్​పై పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. చెన్నూరు నుంచి మాజీ విప్ నల్లాల ఓదెలు సతీమణి, ప్రస్తుత మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి సైతం పోటీ చేసే ఛాన్స్​ ఉందంటూ కొద్దికాలం కిందట ప్రచారం కూడా జరిగింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి  మరికొందరు మహిళా నేతలు పోటీకి సిద్దమంటున్నారు.