కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!

కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!
  •  నిరసన తెలిపితే ఉపా కేసులా.?
  •  ప్రశ్నిస్తే పాత కేసులు తిరగదోడుతారా?
  •  విపక్షాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్
  •  కనీసం ఐదు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం
  •  ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలోకి పలువురు నేతలు

హైదరాబాద్: కారుపై పోరుకు విద్యార్థి ఉద్యమ నేతలు రెడీ అవుతున్నారు. ఉద్యమాల ఉస్మానియా.. కదన రంగన నిలిచిన కాకతీయ వర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలు అధికార పార్టీపై పోటీకి సై అంటున్నారు. బీఆర్ఎస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో ముందుండి పోరాడిన విద్యార్థి జేఏసీ నాయకులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఓయే జేఏసీ కనీసం ఐదుగురిని ఎన్నికల బరిలోకి దింపాలని తీర్మానించింది. అటు వరంగల్ కేయూలోనూ విద్యార్థి జేఏసీ నాయకులు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. విద్యార్థి జేఏసీగా ఏర్పడి స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలా..? ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలా..? టికెట్లు సాధించడం ఎలా.? అన్న అంశాలపై రెండు వర్సీటీల్లో అంతర్గత సమావేశాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సర్కారు అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగానే తాము ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నామని ఓ విద్యార్థి నాయకుడు చెప్పారు. ఓయూ పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ కోట శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. 

2022లో గ్రూప్ 1, 2, 3, 4 కేడర్‌లలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల, తెలంగాణ హైకోర్టు గ్రూప్–1 పరీక్ష కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించలేదని పేర్కొంటూ దానిని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నాలాంటి విద్యార్థి నాయకుల్లో చాలా ఆశలు ఉన్నాయి. తెలంగాణ వస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందనుకున్నాం. కొలువులు వస్తాయనుకున్నం.. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు ఏమీ చేయలే ’అని శ్రీనివాస్ అంటున్నారు. "సమైక్య రాష్ట్రంలో నాపై ఉపా చట్టం కింద 9 కేసులు నమోదు చేశారు. నన్ను అరెస్టు చేసి ఆరు నెలలు జైలులో ఉంచారు. మావోయిస్టుల కోసం నిధులు సేకరించినందుకు, వారికి దిశానిర్దేశం చేసినందుకు నన్ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను భయపెట్టడానికే ఈ కేసులు పెట్టారని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం కొట్టివేసింది. సొంత రాష్ట్రం ఏర్పడ్డా ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, రాష్ట్రంలో ఐదు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో శ్రీనివాస్ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వం తనపై ఉన్న నాలుగు కేసులను మళ్లీ తెరిచిందని శ్రీనివాస్ అంటున్నారు. 

ఓయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన మరో రీసెర్చ్ స్కాలర్ కంచర్ల బద్రి బీఎస్పీలో చేరి భూపాలపల్లి టికెట్ ఆశిస్తున్నారు. బద్రి డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, రాష్ట్రంలో దళితులపై దాడులు, నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో బద్రి చురుగ్గా పాల్గొన్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై ఉపా చట్టం కింద10 కేసులు పెట్టింది. నేను మావోయిస్టుల కోసం నిధులు సమకూరుస్తున్నానని, నా దగ్గర మావోయిస్టు సాహిత్యం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇదంతా అబద్ధం. 2020లో ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాను. నాలాంటి లక్షలాది మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమంలో దాదాపు 20 ఏండ్ల జీవితాన్ని కోల్పోయాం. ఇప్పుడు ఇలా వేధించడం ఏమిటి..? అని బద్రి ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్న రీసెర్చ్ స్కాలర్లు.. ఆనాడు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థి నేతలు ఆకాంక్షలు నెరవేర్చని బీఆర్ఎస్ సర్కారుపై పోరుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలనుకలుస్తూ.. తమకు టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. పార్టీలు కేటాయించని పక్షంలో విద్యార్థి జేఏసీగా బరిలోకి దిగేందుకు సిద్ధమంటున్నారు. 

ALSO READ : ఎన్టీఆర్ అదుర్స్ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి


టికెట్లు ఆశిస్తున్న విద్యార్థి నేతలు 


పేరు                           పార్టీ                   సెగ్మెంట్

వెంకటేశ్ చౌహాన్     బీఎస్పీ               దేవరకొండ
మానవతారాయ్      కాంగ్రెస్                సత్తుపల్లి
దుర్గం భాస్కర్        కాంగ్రెస్                చెన్నూరు
కే విజయ్ కుమార్  కాంగ్రెస్                  గద్వాల
కేటూరి వెంకటేశ్    కాంగ్రెస్               కొల్లాపూర్
కే కైలాష్                   బీఎస్పీ               మునుగోడు
కోట శ్రీనివాస్          కాంగ్రెస్                పెద్దపల్లి
బద్రి                         బీఎస్పీ                  భూపాలపల్లి