ట్రూ అప్​ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ

ట్రూ అప్​ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ
  • రూ.963 కోట్ల వసూలుకు అనుమతించాలని జెన్ కో ప్రతిపాదనలు
  • అభ్యంతరాలు లేవనెత్తిన ఇండస్ట్రీలు, విద్యుత్  నిపుణులు 

హైదరాబాద్​, వెలుగు: విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణ చేపట్టింది. టీజీఈఆర్సీ నూతన కార్యాలయంలో చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) ఎంఏ మనోహరరాజు, బండారు కృష్ణయ్య (ఫైనాన్స్) సోమవారం  ఓపెన్​ ఎంక్వైరీ నిర్వహించారు. జెన్‌కో ఫిక్స్‌డ్‌ చార్జీలు, ట్రూ అప్‌ చార్జీలపై విచారణ జరిగింది. 2022–--23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్‌ చార్జీలు, 2024-–25 నుంచి 2028--–29 కాలానికి (ఐదో నియంత్రణ కాలానికి) మల్టీ ఇయర్‌ టారిఫ్‌ పై ఎంక్వైరీ చేపట్టారు. 

ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ. 963.18 కోట్ల వసూలుకు అనుమతించాలని ఈర్సీని జెన్‌ కో  కోరింది. టీజీ జెన్‌ కో పిటిషన్‌పై తొలుత  ఆ సంస్థ  డైరెక్టర్ సచ్చిదానందమూర్తి జెన్​ కో ట్రూ అప్, 5వ నియంత్రిక కాలానికి సంబంధించిన గైడ్​లైన్స్​ను ఆమోదించాలని కోరుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత పలు ఎఫ్‌టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌, స్టీల్‌ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. విద్యుత్​ నియంత్రణ మండలి (ఈఆర్సీ) పదవీకాలం ముగింపునకు పది రోజుల ముందే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవడంపై అనుమానం వ్యక్తంచేశారు. 

ఆర్డర్లు ముందే సిద్ధం చేశారా?

ఇప్పటికే ఆర్డర్లు సిద్ధం చేసి  చిన్న చితకా మార్పులతో  ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని విద్యుత్​ రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ఈఆర్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇవి ప్రజలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో నియమించిన ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌ రాజు, బండారు కృష్ణయ్య ఐదేండ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. 

దీంతో సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుసగా ఐదు రోజులపాటు జెన్​కో, ట్రాన్స్​కో, సదరన్​, నార్తర్న్​ డిస్కంలు, సెస్​లపై బహిరంగ విచారణ చేపడుతోంది. విద్యుత్ సంస్థలకు చెందిన 9 ప్రతిపాదనలపై 3 వారాల్లో అధ్యయనం, బహిరంగ విచారణలు, ఆర్డర్లు తయారు చేయడం సాధ్యం కాదు” అని వేణుగోపాల్​రావు స్పష్టం చేశారు. విద్యుత్తు ప్లాంట్లల్లో సామర్థ్యం కంటే తక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఓపెన్‌ మార్కెట్‌లో కరెంట్​ కొనడంతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని అన్నారు.

డిస్కంలకు 18,500 కోట్లు ఎగ్గొట్టిన గత బీఆర్ఎస్​ సర్కార్​

గత బీఆర్ఎస్​సర్కారుడిస్కంలకు రూ. 18,500 కోట్లు ఎగ్గొట్టింది. 2016–17 నుంచి  2022–23 ఆర్థిక సంవత్సరాలకు రూ.12,550 కోట్ల విద్యుత్​ కొనుగోళ్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని తామే డిస్కంలకు చెల్లిస్తామని చెప్పిన గత ప్రభుత్వం.. పైసా కూడా విడుదల చేయలేదు. వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల కింద రావాల్సిన రూ.2,378 కోట్లు కూడా ఇవ్వలేదు. కొన్నేండ్లుగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కరెంట్​ బిల్లులు చెల్లించడం లేదు. ఇలా బీఆర్​ఎస్​ పాలనలో ఎగ్గొట్టిన రూ.18,500  కోట్లు ఇప్పుడు విద్యుత్​ సంస్థలు కొత్తగా చార్జీలు మోపే ప్రతిపాదనల్లో చేర్చడం గమనార్హం.