అసెంబ్లీ రేసులో..ఉద్యోగులు, డాక్టర్లు

  • విభిన్న రంగాల నుంచి పాలిటిక్స్​లోకి..
  • పార్టీలు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్​గా పోటీకి సై 
  • ఇప్పటికే అప్లై చేసుకొని ఎదురుచూస్తున్న పలువురు 

ఆదిలాబాద్, వెలుగు : పొలిటికల్​ ఎంట్రీ కోసం ఉద్యోగులు, ఆఫీసర్లు, డాక్టర్లు తహతహలాడుతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు గవర్నమెంట్​ఉద్యోగాన్ని సైతం వదులుకొని, పార్టీల్లో చేరి టికెట్​ఆశిస్తున్నారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఆ ఉద్యోగాన్ని వదులకొని రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటునేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు అప్లై చేసుకొని అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.  

పొలిటికల్ ఎంట్రీ..

వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న చాలా మంది పాలిటిక్స్​లోకి ఎంటర్​ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగులు, ఆఫీసర్లు, రిటైర్​మెంట్​తీసుకున్నవారిపాటు వ్యాపారులు సైతం సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల పలువురు వివిధ పార్టీల్లోకి చేరుతున్నారు. బోథ్ నియోజకవర్గం కోసం బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సెడ్మకి గోద్రు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్​గా ఉన్న సాకటి దశరథ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన సైతం బీజేపీ నుంచి బోథ్ టికెట్ ఆశిస్తున్నారు. డాక్టర్​గా పనిచేస్తున్న వన్నెల అశోక్, అడ్వకేట్ ఆడె గజేందర్ సైతం బోథ్ కాంగ్రెస్ నుంచి  పోటీలో ఉన్నారు.

ఇండిపెండెంట్​గానైనా పోటీ చేస్తామంటూ ప్రచారం

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ భర్త శ్యాం నాయక్ తన ఆర్టీవో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటీవలే కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్లై చేసుకున్నారు. అనుచర గణాన్ని పెంచుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారిగా ఉన్న జాదవ్ రాం కిషన్ నాయక్ పదవీ విరమణ తర్వాత గత నెలలో కాంగ్రెస్ లో చేరి ఖానాపూర్ టికెట్ ​కోసం అప్లై చేసి పోటీ సై అంటున్నారు. గవర్నమెంట్ లెక్చరర్ తొడసం ధనలక్ష్మి సైతం కాంగ్రెస్ నుంచి టికెట్​ఆశిస్తున్నారు. ముథోల్ నియోజకవర్గం టికెట్​కోసం కాంగ్రెస్​కు దరఖాస్తు చేసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి దరఖాస్తులు చేసుకున్న వీరు పార్టీలు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము బరిలో ఉంటామని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీలకు టికెట్ కోసం అప్లై చేసుకోని కొందరు కూడా తాము ఇండిపెండెంట్​గా పోటీలో ఉంటామని చెబుతున్నారు. సెరీకల్చర్ ఉద్యోగి రాథోడ్ పార్వతి బోథ్​ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పుకుంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత కొంత కాలంగా బోథ్​లో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న లెక్చరర్ బలరాం జాదవ్ సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కుల సంఘాల నాయకులు కూడా..

ఉద్యోగులే కాకుండా కుల సంఘాల నాయకులు సైతం ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలైన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్ల నుంచి ఇతర జిల్లాల నేతలు బరిలో ఉండేందుకు సిద్ధమయ్యారు. ఈ మూడు సెగ్మెంట్లలో ప్రతి నియోజకవర్గంలో ఆదివాసీల ఓట్లు 30 వేలకు పైగా ఉండటంతో ఆదివాసీ లీడర్లు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య ఆసిఫాబాద్​ నుంచి, ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు గొడం గణేశ్ బోథ్ నుంచి, ఆ సంఘం నేత బుర్క బాపూరావు ఖానాపూర్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు.