‘రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలిచేస్తారా? లగచర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం

‘రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలిచేస్తారా? లగచర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం
  • నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్​
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి, సీఎస్, డీజీపీకి ఫిర్యాదు 
  • నేడు సీసీఎల్ఏ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల జేఏసీ ధర్నా

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వ ఉద్యోగులు సీరియస్​గా తీసుకున్నారు. సంఘాలకు అతీతంగా  ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నుంచి గ్రూప్ 1 అధికారుల దాకా అందరూ ఏకతాటిపైకి వచ్చి దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కొన్ని పొలిటికల్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను టార్గెట్​ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కుట్రలకు తమను బలిచేస్తారా? అంటూ మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కులగణనకు వెళ్తున్న ఎన్యుమరేటర్లను సైతం ఓ పార్టీ నేతలు, కార్యకర్తలు పనిగట్టుకొని అడ్డుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కులగణనకు వచ్చిన ఉద్యోగులను హామీల అమలుపై నిలదీయాలని కొందరు నేతలు పిలుపునివ్వడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అసలు సర్కార్ హామీలకు ఉద్యోగులకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. కాగా, దాడి ఘటనపై రెవెన్యూ మంత్రి శాఖ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, డీజీపీ జితేందర్​కు ఉద్యోగుల జేఏసీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. 

కలెక్టర్ పై దాడితో రాష్ర్టవ్యాప్తంగా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. గురువారం సీసీఎల్ఏ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. మరోవైపు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. ఇందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇది యావత్​ ఉద్యోగ లోకంపై దాడి..

కలెక్టర్‌‌పై దాడి ఘటనను ఒక‌‌రిద్దరు అధికారుల‌‌పై జ‌‌రిగిన దాడిగా చూడొద్దని, తెలంగాణ‌‌లోని యావ‌‌త్​ఉద్యోగ లోకంపై జ‌‌రిగిన దాడిగా భావిస్తున్నామని తెలంగాణ ఉద్యోగు జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్​ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. కలెక్టర్, అధికారులపై దాడి చేయడం బాధాకరమన్నారు. కులగణన సమాచారం సేకరణకు వెళ్తున్న ఎన్యుమరేటర్లు, ఇతర అధికారులపై కూడా కావాలని మాటలతో దాడి చేస్తున్నారని చెప్పారు. 

వీఆర్వోల జేఏసీ చైర్మన్​ గోల్కొండ సతీశ్​ మాట్లాడుతూ..  కలెక్టర్, ఉద్యోగులపై దాడికి గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థ లేకపోవడమే కారమన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు ఉంటే అక్కడ జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేవాళ్లని తెలిపారు. యూటీఎఫ్​ నేత చావ రవి మాట్లాడుతూ..  కులగణనకు వెళ్లిన ఎన్యుమరేటర్లను, ఉద్యోగులను అడ్డుకోవాలని కొన్ని పార్టీల నేతలు పిలుపునిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలకు ఉద్యోగులకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. 

ఉద్యోగులకు బ్లాక్ డే

ఈ దాడి జరిగిన రోజు.. ఉద్యోగులకు బ్లాక్ డే. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు. కులగణనలో వివరాలు సేకరించటానికి వెళ్తున్న ఎన్యుమరేటర్లు, ఇతర ఉద్యోగులను కూడా కొంతమంది కావాలని వేధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం ఇచ్చిన డ్యూటీ చేస్తున్నారు. 30 ఏళ్ల నుంచి విధుల్లో ఉన్నాను. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ఈ దాడిని సీఎం, మంత్రులు ఖండించినా.. ఇతర పార్టీల నేతలు స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరం. - శ్రీనివాసరావు, ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్  

ప్లాన్ ప్రకారమే దాడి

కలెక్టర్, అధికారులపై రైతుల పేరుతో కొందరు దాడి చేయడం బాధాకరం. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే కొంతమంది చేసిన కుట్రగా భావిస్తున్నాం. ప్రజల కోసమే ఉద్యోగులు పని చేస్తారు. భౌతిక దాడులు కరెక్ట్ కాదు. అన్ని పార్టీల నేతలు ఈ ఘటనను ఖండించాలి. - చంద్రశేఖర్ గౌడ్,  ప్రెసిడెంట్, గ్రూప్ 1 ఆఫీసర్ల అసోసియేషన్ 

కుట్ర కోణం ఉన్నది

లగచర్ల ఘటన యావత్ ఉద్యోగ సమాజానికి చీకటి రోజుగా భావిస్తున్నాం. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్, అధికారులు వెళ్లారు. అంతే తప్ప రైతుల భూములు లాక్కునేందుకు వెళ్లలేదు. అక్కడికి రైతుల ప్లేస్ లో వేరే వాళ్లు వచ్చారు. ఇందులో కుట్ర కోణం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. - వంగ రవీందర్ రెడ్డి,  ట్రెసా ప్రెసిడెంట్