త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు

త్వరలో స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు
  •      ఏపీలో పని చేస్తున్న 144 మందిని తీసుకొచ్చే ప్రాసెస్ స్పీడప్ 
  •     రిలీవ్ చేయాలని ఏపీ సర్కార్​కు సీఎస్ శాంతికుమారి లేఖ  
  •     ఉద్యోగులతో సమావేశమైన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు :  ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వాళ్లను తాము తీసుకుంటామని, ఎన్ వోసీ ఇచ్చి రిలీవ్ చేయాలని ఏపీ సర్కార్ కు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులంతా ఈ నెలాఖరు కల్లా స్వరాష్ట్రానికి వస్తారని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో ఏపీలో పని చేస్తున్న 144 మంది తెలంగాణ ఉద్యోగులతో టీఎన్జీవో నేతలు సమావేశమయ్యారు. 

ఉద్యోగులు పదేండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని, తెలంగాణ ఎంప్లాయీస్ ను రిలీవ్ చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ కు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారని జగదీశ్వర్, ముజీబ్ తెలిపారు. ఈ అంశంపై ఏపీ ఉన్నతాధికారులను కలుస్తామని, ఈ నెల 19న ఏపీ సెక్రటేరియెట్ కు వెళ్లి సీఎస్ తో చర్చిస్తామని చెప్పారు. ‘‘స్వరాష్ర్టానికి తీసుకురావాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు పదేండ్లుగా పోరాడుతున్నారు. 

వాళ్లను రిలీవ్ చేస్తామని 2019కి ముందే ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ దీనిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చొరవ చూపలేదు. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ పట్టించుకోలేదు. మా యూనియన్ నేతలకు అప్పటి సీఎం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో మీటింగ్ లో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు” అని తెలిపారు.