హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి రాబోతున్నారు. అక్కడ పనిచేస్తున్న 122 మంది నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ జీఏడీ సెక్రటరీ పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు ఈ ఏడాది జనవరి 11న ఇచ్చిన వినతిపత్రం మేరకు వీరిని రిలీవ్ చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు 1,200 మంది ఏపీకి అలాట్ అయ్యారు. అందులో 580 మంది నాలుగో తరగతి ఉద్యోగులు గతంలో స్వరాష్ట్రానికి వచ్చారు. తప్పు ఆప్షన్లు ఇచ్చిన మరో 100 మందితో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. గత పదేండ్లలో కొందరు రిటైర్ అయ్యారని, కరోనా టైమ్లో కొందరు మరణించారని ఉద్యోగులు చెప్తున్నారు. కాగా, వచ్చే నెల 1 తరువాత ఈ 122 మంది ఉద్యోగులు తెలంగాణకు రానున్నట్టు తెలుస్తోంది.
ఏపీ సర్కారు ఓకే చెప్పినా.. చర్యలు చేపట్టని గత ప్రభుత్వం
ఏపీలో పనిచేస్తున్న తమను స్వరాష్ట్రానికి తీసుకురావాలని గత పదేండ్ల నుంచి గత సీఎం కేసీఆర్ ను, ఉన్నతాధికారులను, ఏపీ సీఎంలు చంద్రబాబు, వైఎస్ జగన్ లను ఉద్యోగులు, వారి తరఫున టీఎన్జీవో, టీజీవో నేతలు పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయితే, తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ సర్కారు చెప్పినప్పటికీ ఇక్కడి అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. దీంతో ఇన్నేండ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పీడప్ చేసిన రేవంత్ సర్కార్
గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సమస్యను వివరించారు. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం స్పీడప్చేసింది. వెంటనే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎస్ ను సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఎంపీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రాసెస్ లేట్ అయింది. ఇటీవల హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమైనపుడు ఈ అంశంపైనా చర్చించారు. ఆ తర్వాత టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రెసిడెంట్ జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ముజీబ్ తెలంగాణ, ఏపీ సీఎస్ లతో పాటు సీఎంవో సెక్రటరీ రవిచంద్రను కలిసి చర్చించగా వారిని రిలీవ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన రెండు రాష్ట్రాల సీఎంలు, సీఎస్ లు, సీఎంవో సెక్రటరీకి టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.
మమ్మల్ని కూడా తీసుకురండి
ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన తమను కూడా స్వరాష్ట్రానికి తీసుకురావాలని 320 మంది జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులు కోరుతున్నారు. పదేండ్లుగా తాము అంతర్ రాష్ట్ర బదిలీల కోసం ఎదురుచూస్తున్నామని ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘం నేతలు లక్ష్మీనారాయణ, అంజయ్య తెలిపారు. అలాగే, తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర స్థానికత గల 1,336 మంది ఉద్యోగులు కూడా అంతరాష్ట్ర బదిలీలలో తమను ఏపీకి పంపించాలని కోరుతున్నారు. అయితే, సీఎంల సమావేశంలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల పరస్పర బదలాయింపునకు అంగీకరించారని నేతలు తెలిపారు.