తెలంగాణ మహాకవి దాశరథి దాశరథి కృష్ణమాచార్య .. ఓ ఉద్యమం. ఆయన కవిత్వం ఓ తిరుగుబాటు. ఆయన పాట ఓ ధిక్కారం. ఆయన కలం దేనికి లొంగని ఆయుధం. అందుకే నిజాంని ‘పిశాచమా’ అని రాసి, పాలకులకు ఎదురుగా నిలబడింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా చాటి చెప్పింది. జైల్లో వేసినప్పుడు ఆ గోడలే కాగితాలుగా, అక్షర తూటాలు విసిరింది. అంతేకాదు.. రక్తపుటేరులను ‘అగ్నిధార’గా మలిచి తెలంగాణ ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతేకాదు, ఆయన కలమే మరో వైపు నుంచి శృంగార కవితలు, సినిమా పాటలు రాసి ఔరా! అనిపించింది.
తెలంగాణలో ఆవేశం అనే తుపాకీతో అక్షరాలనే తూటాలను పేల్చి.. ప్రజలను చైతన్య పరిచిన కవుల్లో దాశరథి కృష్ణమాచార్య ఒకరు. ఆయన రాసిన ఎన్నో పద్యాలు, కవితలు ప్రజలను ఉద్యమాల వైపు నడిపించాయి. చైతన్యవంతులను చేశాయి. మరోవైపు సినిమా పాటలు కూడా రాశారు. ఆయన పేరు వినగానే ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే కవితా నినాదం, ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో...” అనే పాట గుర్తొస్తాయి.
వెంకటమ్మ, వేంకటాచార్యులకు 1925 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో పుట్టారు దాశరథి. ఇప్పుడు ఆ ఊరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దాశరథి బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూ మీడియంలో చదివి మెట్రిక్యులేషన్ చేశాడు. భోపాల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషు లిటరేచర్‌లో బీఏ చదివాడు. ఇంగ్లీష్‌తో పాటు సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించాడు. తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కానీ.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చేశారు. అప్పటినుంచి హైదరాబాదు సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నాడు. 1987 నవంబర్ 5న కన్నుమూశారు. బతికింది 62 ఏళ్లే అయినా.. వెయ్యేళ్ల కీర్తి తెచ్చుకున్నాడు. కవిసింహం, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్రా కవితా సారథి అనే బిరుదులు సాధించాడు. తెలంగాణ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించాడు. ఆయన ప్రతి రచనలోనూ వైవిధ్యం ఉంటుంది. ఆయన రాసిన ప్రతి పాట మాధుర్యమే. అటు కవితా నిప్పురవ్వలతో ఉద్యమాన్ని రాజేశారు. ఇటు సినిమా పాటలతో అందరినీ అలరించారు. కానీ.. సినిమాలకు పాటలు రాయడం మొదలుపెట్టకముందే గొప్పకవిగా పేరు తెచ్చుకున్నాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
ఉర్దూ కలగలిపిన తెలుగులో కవిత్వం రాశారు. కవిగానే కాకుండా గొప్ప రీసెర్చర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. 1961లో సినిమా కవిగా పరిచయమయ్యారు. ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో అన్ని పాటలూ ఆయనే రాశారు. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీలో తిరిగి చూసుకోలేదు. దాశరథికి ప్రాచీన సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉండేది. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. ఉద్యమకారుడిగా, టీచర్‌గా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, రేడియో ఉద్యోగిగా, ఇంగ్లీష్, సంస్కృత, ఉర్దూ భాషల్లో రచయితగా చేసి మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కవితలు, నాటికలు, పాటలు, సినిమా పాటలు రాశారు. ఆయన రాసిన ‘అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, మార్పు నా తీర్పు, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, అమృతాభిషేకం’ రచన బాగా ఫేమస్ అయ్యాయి. ఇక ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో...’ పాటకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. ‘గోరింక గూటికే చేరావు చిలకా, గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది..’ లాంటి పాటలను ఇప్పటికీ చాలామంది వింటుంటారు. తెలుగులో మొట్టమొదటి గజల్‌ని దాశరథి రాశారు. చాలా ఉర్దూ కవితలను ట్రాన్స్‌లేట్ చేశాడు. మిర్జా అసదుల్లాఖాన్ గాలిబ్ రాసిన ఉర్దూ గజళ్లను తెలుగులో రాశారు.
జైలు గోడలపై చెరగని ముద్రలు
నిజాం కాలంలో జరిగిన ఉద్యమానికి కవులు చాలా స్పూర్తినిచ్చారు. దాశరథి నైజాం రాజును వ్యతిరేకిస్తూ కవితలు రాశాడు. దాంతో ఆయన్ని జైలులో పెట్టారు. ఆయనతోపాటు మరో 150మందిని ఇందూరు జైలులో పెట్టారు. అందులో ప్రముఖ కవి వట్టికోట ఆళ్వారు స్వామి కూడా ఉన్నారు. జైలులో ఉన్నప్పుడు పళ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో గోడల మీద ఇద్దరూ కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, కవితలు రాశారు. అది చూసి జైలు సిబ్బంది ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్షర తూటాలు సంధించడం మానుకోలేదు. ఆయన పుట్టింది సంప్రదాయ కుటుంబమే అయినా.. ఆ కట్టుబాట్లను, ఆచారాలను తెంచుకుని ప్రగతిశీల భావాల వైపు అడుగులు వేశాడు.
అనేక పురస్కారాలు
దాశరథి అనేక గౌరవాలు, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ‘కళాప్రపూర్ణ’ బిరుదు వచ్చింది. ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలు గౌరవ డి–లిట్‌లను ఇచ్చాయి. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది. ఆయనే చివరి ఆస్థాన కవి. దాశరథికి 1967 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. 1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి కూడా అందుకున్నారు.