
- ఈవీతో గ్రేటర్ దాటి వెళ్లలేకపోతున్న జనం
- తగినన్ని స్టేషన్ల ఏర్పాటుపై ఫోకస్ పెట్టిన రెడ్కో
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్ కు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రాష్ట్రాంలో వాటి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూడు నెలల కాలంలోనే ఒక్క గ్రేటర్ పరిధిలోనే సుమారు లక్ష వరకు వెహికల్స్ కొనుగోళ్లు జరిగాయని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్రేటర్ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ఈవీ యజమానులు నెట్టుకొస్తున్నారు. కానీ.. గ్రేటర్ దాటి ఈవీ వెహికల్స్ లో వెళ్లాలంటే వాటి యజమానులు వెనుకడుగు వేస్తున్నారు.
బయటి ప్రాంతాల్లో తక్కువగా ఛార్జింగ్ స్టేషన్లు ఉండడంతో ఈవీ వెహికల్స్ ను పక్కన పెట్టి డీజిల్, పెట్రోల్ వెహికల్స్ లో వెళ్లేందుకే జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని గుర్తించిన సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ( రెడ్కో ) ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. పెట్రోల్ బంకుల వలే వీటిని కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే కనీసం ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక స్టేషన్ ను ఏర్పాటు చేసే ప్లాన్ ను సిద్ధం చేసింది. ఇటు గ్రేటర్, హెచ్ఎండీఏ పరిధితో పాటు అటు ఇతర జిల్లాల్లో, ప్రధాన రహదారుల వెంట కనీసం 50 గజాల స్థలం ఉంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతి ఇస్తామని చెప్తుంది. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఆసక్తి ఉన్న వారు తమను సంప్రదిస్తే స్టేషన్ల ఏర్పాటుకు సహకరిస్తామని రెడ్కో చెపుతోంది.