హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్న హైదరాబాద్ నగరవాసులు బీ అలర్ట్. డిసెంబరు 31 రాత్రి జరుపుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీల్లో ఎవరైనా తెలంగాణ మద్యం బదులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం వినియోగిస్తే కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎక్సైజ్‌తో టీజీన్యాబ్ ఇతర నిఘా బృందాలతో తనిఖీలు ముమ్మరంగా చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ నుంచి 42 ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్‌పై ఫోకస్ పెట్టనున్నారు.
అనుమతి లేని ఈవెంట్ పార్టీలపై కూడా నిఘా గట్టిగా ఉండనుంది. కొత్త సంవత్సర స్వాగత సంబరాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఎస్టిఎఫ్ ( స్టేట్ టాస్క్ ఫోర్స్), డీటీఎఫ్ ( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) ఎక్సైజ్, ఇతర టీమ్‌లు తనిఖీల్లో భాగం కానున్నాయి. కొన్ని టీమ్‌లు టీజీ న్యాబ్‌తోను, మరికొన్ని టీమ్‌లు పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు:
* నూతన సంవత్సరం వేడుకలు దృష్టిలో పెట్టుకుని పలు ఆంక్షలు విధించిన సైబరాబాద్ పోలీసులు
* సైబరాబాద్ పరిధిలో డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటల నుంచి జనవరి 1, 2025 ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేత
* ఔటర్ రింగ్ రోడ్డుపై కేవలం ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి
* సైబరాబాద్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపిన పోలీసులు
* సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖాకీల హెచ్చరిక