
- మొత్తం 604 బ్రాండ్ల అనుమతి కోసం దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు 92 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మొత్తంగా 604 కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో 331 బ్రాండ్లు ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) కాగా, 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయని పేర్కొంది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల బ్రాండ్లకు, 45 పాత కంపెనీల నుంచి 218 రకాల బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని, ఆ తర్వాతే అనుమతి ఇస్తుందని ఆయన వెల్లడించారు.