14 వేల లీటర్ల మందు ..170 కేజీల గంజాయి.. నిజామాబాద్లో స్వాధీనం

 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో  అంతర్రాష్ట్ర సరిహద్దులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో  భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో చేసిన తనిఖీల్లో 14 వేల లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. 
 
తెలంగాణ ఎన్నికల సన్నద్దతపై అక్టోబర్ 5వ తేదీన ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో  నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ 14,227 లీటర్ల ఐడీ మద్యం, 1,710 కేజీల బెల్లం, 94.8 లీటర్ల మద్యం, 170 కేజీల గంజాయి, 21 వాహనాలను సీజ్ చేసింది. 

ALSO READ : తూ...యాక్.. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా ఇలా తయారు చేస్తారా..?

గతం వారం ఎన్నికల సంఘం పర్యటనలో ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో  డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరిహద్దులు దాటిస్తారని..దీని పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. మద్యం అక్రమ విక్రయాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా 29,663 మంది అనుమానితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ గుర్తించింది. 8,362 హిస్టరీ షీటర్లపై కూడా నిఘా ఉంచింది.  అంతర్రాష్ట్ర సరిహద్దులను నిశితంగా పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి అక్రమంగా మద్యం తరలింపును నియంత్రించాలని భావిస్తున్నారు.


ప్రత్యేక చర్యల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ 24 గంటల పాటు.. చెకింగ్ కోసం అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దులో మరో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కర్నాటక సరిహద్దులోని నాలుగు చెక్‌పోస్టుల దగ్గర  రౌండ్‌ ది క్లాక్‌ చెకింగ్‌ కూడా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒక  చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల దగ్గర సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను  కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు.