రాష్ట్రంలో యూరియా కొరత.. ఈ సారి అంచనాలకు మించి యాసంగి సాగు

రాష్ట్రంలో యూరియా కొరత.. ఈ సారి అంచనాలకు మించి యాసంగి సాగు
  • యూరియాకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
  • నిరుడు ఇదే టైమ్​కు 5.83 లక్షల టన్నుల వినియోగం
  • ఈ సారి ఇప్పటికే 7 లక్షల టన్నులు తెప్పించినా సరిపోలే
  • మార్క్​ఫెడ్​ వద్ద తగ్గిన బఫర్ ​స్టాక్​ నిల్వలు
  • కేంద్రం నుంచి ఈ నెల కోటా ఇంకా ఆలస్యం
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యూరియా కోసం రైతుల బారులు

హైదరాబాద్, గొల్లపల్లి, చిగురుమామిడి, లోకేశ్వరం,వెలుగు: రాష్ట్రంలోని పలుచోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యూరియా కొరత నెలకొన్నది. ఈ సారి అంచనాలను మించి యాసంగి సాగు కావడంతో.. యూరియాకు ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. ఈ యాసంగిలో  దాదాపు 70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులోనూ 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. నిరుడు ఇదే టైమ్​కు 5.83 లక్షల టన్నుల యూరియా వినియోగమే జరిగింది. దీంతో ఈసారి ఇప్పటివరకూ అంతకుమించి 7 లక్షల టన్నులకుపైగా యూరియా తెప్పించినా.. సరిపోలేదు. మార్క్ ఫెడ్​ దగ్గర బఫర్​స్టాక్​ నిల్వలు దగ్గరపడడం, కేంద్రం నుంచి రావాల్సిన ఈ నెల కోటా ఇంకా రాకపోవడంతో పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు.

అధికారుల లెక్క తప్పింది
మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(ప్యాక్స్), ప్రైవేట్​డీలర్ల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నది.  నిరుడు ఫిబ్రవరి చివరి నాటికి  యాసంగి సాగు 50 లక్షల ఎకరాలే. కానీ ఈ సారి సాగు ఏకంగా 70 లక్షల ఎకరాలకు, అందులోనూ వరి 55 లక్షల ఎకరాలకు చేరింది. ఈ స్థాయిలో సాగు పెరుగుతుందని మార్క్​ఫెడ్​అంచనా వేయకపోవడం వల్ల యూరియా సమస్య మొదలైంది. నిజానికి ఈ ఏడాది యాసంగి సీజన్​కోసం అక్టోబర్​ నుంచి మే నాటికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని మార్క్​ఫెడ్​అంచనా వేసింది. ఈ క్రమంలో జనవరి21 నాటికే 7 లక్షల టన్నుల యూరియా తెప్పించింది.

నిరుడు ఫిబ్రవరి చివరినాటికి 5.83లక్షల టన్నుల వినియోగమే జరిగింది. అప్పటి కన్నా 1.17 లక్షల టన్నులు ఎక్కువ తెప్పించినా సరిపోవడం లేదు.  ఈ సారి ఫిబ్రవరి నాటికే సాగు అనూహ్యంగా పెరగడం.. యూరియా అధిక వినియోగంతో కేంద్రం నుంచి ప్రతినెలా వస్తున్న స్టాక్​వచ్చినట్లే ఖాళీ అవడంతోపాటు మార్క్​ఫెడ్​వద్ద బఫర్​ నిల్వలూ కరిగిపోతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.30 లక్షల టన్నుల స్టాక్​ మాత్రమే ఉండగా, మరో లక్ష టన్నులు కేంద్రం నుంచి వస్తేనే ప్రస్తుత అవసరాలు తీరనున్నాయి. కాగా, శనివారం సాయంత్రానికి 20 వేల టన్నులు యూరియా వచ్చిందని, దీనిని కొరత ఉన్న జిల్లాలకు పంపిస్తున్నామని మార్క్​ఫెడ్​ ఆఫీసర్లు ‘వెలుగు’కు తెలిపారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొరత 
ప్రస్తుతం మార్క్ ఫెడ్ లో యూరియా బఫర్​ స్టాక్ కేవలం​ 45,596 టన్నులు ఉంది.  తాజాగా..  కేంద్రం నుంచి వచ్చిన 20 వేల టన్నులతో కలిసి నిల్వలు 65 వేల టన్నులకు చేరాయి. సహకార సంఘాల వద్ద మరో 10 వేల టన్నులు, ప్రైవేట్​ డీలర్ల వద్ద ఉన్నది కలిపితే కేవలం 1.30 లక్షల టన్నుల వరకు మాత్రమే యూరియా నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు అవసరం ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఎక్కువ స్టాక్​ పంపించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వరి సాగు ఎక్కువగా జరిగిన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో యూరియా నిల్వలు రెండు, మూడు వేల టన్నుల లోపే చేరుకున్నాయి.  ఈ నేపథ్యంలో పలు ప్యాక్స్​ల పరిధిలో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు.

బస్తాల కోసం ఆధార్ కార్డు లైన్ 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కట్టారు.  జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్యాక్స్ సెంటర్ కు శనివారం 800 బస్తాలు రాగా.. రైతులు ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి తీసుకున్నారు. కొందరికి దొరక్కపోవడంతో  నిరాశతో వెనుదిరిగారు. డైరెక్టర్లు తమకు సంబంధించిన వారికే ఇప్పించుకున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో  రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజామున స్థానిక సహకార సంఘ కేంద్రం వద్దకు భారీగా తరలివచ్చారు.

200 బస్తాలే రావడం.. అక్కడికి వందలాదిమంది రైతులు చేరుకోవడంతో.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. గంటలకొద్దీ నిల్చోలేక చెప్పులను క్యూలో పెట్టినా యూరియా దొరుకుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.  అవసరమైన యూరియాను అందిస్తామని మండల వ్యవసాధికారి రాజుల నాయుడు తెలిపారు. వచ్చే 5 రోజుల్లో 8 వేల బస్తాల యూరియా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మండలానికి 2,360 బస్తాలు దిగుమతి అయినట్టు  చిగురుమామిడి సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇప్పటికే యూరియా సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 

యూరియా కోసం ఆందోళన
సీజన్ ప్రారంభమై2  నెలలు గడుస్తున్నా  సరిపడా యూరియా బ్యాగులు అందడం లేదంటూ నిర్మల్ ​జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్లో  రైతులు ఆందోళనకు దిగారు.   మన్మద్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి  ఒక్క లోడ్ యూరియా  వచ్చిందని తెలుసుకున్న  రైతులు శనివారం ఉదయం 6 గంటల నుంచే అక్కడ క్యూకట్టారు. సుమారు 300 మంది రైతులు తరలిరాగా..  పోలీసులు వారిని కంట్రోల్​ చేశారు. సరిపడా యూరియా బస్తాలు లేవని తెలుసుకొని, ఆందోళన చేశారు. మరో లోడ్​ వస్తుందని అధికారులు సముదాయించడంతో అక్కడినుంచి వెనుదిరిగారు.