విశ్లేషణ : లాగోడి ఎక్కువ.. ఆమ్దానీ తక్కువ

దేశంలో వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఒకవైపు వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు భయపెడుతుంటే.. మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పులపాలవుతున్నారు. పండించిన పంటను సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడంతో వడ్ల కుప్పలపైనే రైతులు ప్రాణాలు వదిలేస్తున్నారు. తెలంగాణలో గడిచిన ఏడేండ్లలో 740 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారిక లెక్కలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు వరి కొనుగోలుపై మొదైన పంచాయితీ రైతుల ఉసురు తీస్తోంది. రాష్ట్రంలో వరి పండించే రైతుకు ఉరి మిగులుతుందని సీఎం స్థాయి వ్యక్తులే చెబుతుంటే రైతాంగం గందరగోళంలో పడిపోయింది. వ్యవసాయం గిట్టుబాటు కాక పెట్టిన పెట్టుబడి రాక అనేక అవస్థలు పడుతున్న రైతుల జీవితాలతో పాలకులు చెలగాటం ఆడుతున్నారు. రైతు సమస్యలను పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి తప్ప వారికి మేలు చేసే ప్రయత్నాలు చేయడం లేదు.

ప్రస్తుతం వరి, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి మొదలైన పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటిస్తోంది. కానీ ఆ పంటలు పండించేందుకు అవుతున్న ఖర్చు ఎంతో, కనీస మద్దతు ధర కింద పొందుతున్న మొత్తం ఎంతో రైతులకు ఏటేటా అనుభవమవుతూనే ఉంది. ప్రధాన ఆహార పంటలతోపాటు పొద్దుతిరుగుడు, ఆవాలు, బార్లీ వంటివి సాగు చేసే వారూ ఉత్పత్తి ఖర్చులు రాబట్టుకునే పరిస్థితులు లేవు. గత ఐదు పంట కాలాల్లో వరి, గోధుమకు దక్కిన సగటు ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువేనని లెక్కలు చెబుతున్నాయి. తృణధాన్యాలు పండిస్తున్న వారిలో 70 శాతం మంది రైతులకు కనీస మద్దతు ధర సంగతి తెలియక.. వ్యాపారులు, దళారుల చేతిలో మోసపోతున్నారు. రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కూలీలు, యంత్రాలు, పశువులపై పెట్టిన ఖర్చు, విత్తనాలు, ఎరువులు, సాగునీటి కోసం చేసిన పెట్టుబడి మీద వడ్డీ, కౌలు భూమి విలువ తదితర అన్నింటికీ ఖర్చు పెరిగింది. కానీ, రైతుకు వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో అప్పులతో ఉక్కిరిబిక్కిరై కన్నతల్లి లాంటి భూమిని తెగనమ్ముకోవడమో.. ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. 

సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ
దేశ జనాభాలో 63% మంది ఇప్పటికీ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది రోజువారీ కూలీలే. కొద్దో గొప్పో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వారే కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఇందులో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులే. అందులోనూ కౌలు రైతుల సంఖ్యే ఎక్కువ. దేశవ్యాప్తంగా రెండున్నర ఎకరాల భూమి కలిగిన రైతులే ఎక్కువ శాతం ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సంప్రదాయక వ్యవసాయ విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. 1960లో హరిత విప్లవం పేరుతో ఆధునిక వ్యవసాయ విధానాన్ని పెంపొందించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారు. ఆహార కొరతను అధిగమించేందుకు హరిత విప్లవం ఎంతగానో దోహదపడిందనేది వాస్తవం. టెక్నాలజీ పరంగా అగ్రికల్చర్​ యూనివర్సిటీలు అప్పట్లో కీలకంగా వ్యవహరించాయి. అయితే అటు తర్వాత రసాయనిక ఎరువులు, విత్తనాల వాడకం పెరగడం, నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువుల కారణంగా పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో చాలా మంది రైతులు ఇప్పటికీ సంప్రదాయ సాగు విధానాలను ఆచరిస్తూ వస్తున్నారు. టెక్నాలజీ వీరికి కొంతమేరకే దోహదపడుతోంది. విజ్ఞానాన్ని పెంపొందించడంలో వ్యవసాయ అనుబంధ రంగాలు వేగంగా అభివృద్ధి సాధించినా.. వ్యవసాయ రంగం మాత్రం రైతుకు ఉరితాడుగా మారుతోంది. 

అటు వర్షాలు.. ఇటు నాయకులు
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడి వ్యయం పెరుగుతుంటే.. రైతుకు ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తెచ్చిన అప్పులు తీరడం లేదు. ఉదాహరణకు రాష్ట్రంలో వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన వివాదం రైతులను కష్టాల పాలు చేస్తోంది. పంటను కొనుగోలు కేంద్రాలకు చేర్చినా.. కొనే దిక్కులేదు. దాంతో రాత్రి, పగలు పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. అసలు పంటను కొంటారో లేదో తెలియక దిగులు చెందుతున్న రైతులకు అకాల వర్షాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎండపోసుకున్న వడ్లు అకాల వర్షాలకు తడిసి ముద్దయి ఎంతో మంది రైతులు నష్టపోయారు. ఇదిలా ఉంటే రెండో పంటగా వరి వేయొద్దని స్వయంగా సీఎం కేసీఆర్​ తెగేసి చెప్పడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కేంద్రం బాయిల్డ్ రైస్​ కొనబోమని చెప్పిందని, వచ్చే ఏడాది వడ్లు కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఉండవని, రైతులు తిండి మందం వరి పండించుకోవచ్చని చెప్పారు. వరి వేయకుండా ఆరుతడి పంటలు ప్రోత్సహించడానికి ముఖ్యంగా పెసర, కంది, మినుములు, మొక్కజొన్న వంటి పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆరుతడి పంటలకు రైతు మొగ్గు చూపినా గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడదతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

గిట్టుబాటు ధరకు చట్టబద్ధత అవసరం
మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసినా.. వాస్తవానికి రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర. మనదేశంలో రైతులు పండిస్తున్న పంటలో 23 రకాల పంటలకు కనీస మద్దతు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇందుకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. సాగు ఖర్చుల్లో 50 శాతం కల్పిత గిట్టుబాటు ధర నిర్ణయించి దానిని ప్రతి రైతుకు సక్రమంగా అందేలా చూడాలని స్వామినాథన్ చెప్పి ఎన్నో ఏండ్లు గడిచినా ప్రభుత్వాలు దానిని పట్టించుకోవడం లేదు. అందుకే రైతులు నష్టపోతున్నారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన వైఖరితో ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకానీ రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సింది పోయి.. తనకు కోపం వచ్చినప్పుడల్లా కేంద్రంపై దుమ్మెత్తిపోయడం సరికాదు.

దయనీయంగా రైతు ఆర్థిక పరిస్థితి
తెలంగాణలో ఒక సాధారణ ఔట్​సోర్సింగ్​ అటెండర్ నెలసరి వేతనం కంటే సన్న చిన్నకారు రైతు ఆదాయం తక్కువగా ఉండడం బాధాకరమైన విషయం. వివిధ రాష్ట్రాల్లో రైతుల తలసరి ఆదాయంపై కేంద్రం ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. జులై 2018- జూన్ 2019 మధ్య చేసిన సర్వే ఆధారంగా ఆదాయాలను లెక్కగట్టింది. తెలంగాణలో రైతుకు అన్ని ఖర్చులు పోను నెలకు సగటున రూ.1,695 మిగులుతున్నట్టు వెల్లడించింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 59 .48 లక్షల మంది రైతులు ఉన్నారు. 1.54 కోట్ల ఎకరాల భూమి రైతుల చేతిలో ఉంది. ఇందులో కనీసం ఎకరం పావు నుంచి రెండున్నర ఎకరాలు వరకు భూమి కలిగిన సన్నకారు రైతులు 38.40 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో 64.56 శాతం మంది వీరే అన్నమాట. ఇక రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన చిన్న కారు రైతులు 14.09 లక్షల మంది అంటే 23.69% మంది ఉన్నారు. ఐదు ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 5.64 లక్షల మంది, పది ఎకరాల నుంచి 25 ఎకరాల భూమి ఉన్న రైతులు 1.26 లక్షల మంది, 25 ఎకరాలకుపైగా భూమి ఉన్న వారు 9 వేల మంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులే 88.25 శాతం మంది ఉన్నారు. ఔట్​సోర్సింగ్​ అటెండర్ నెలసరి జీతం రూ.15,600 కాగా, రైతు ఆదాయం సరాసరి రూ.9,403 మాత్రమే. కానీ పెట్టుబడి, ఇతర ఖర్చుల కోసం నెలకు చేసే ఖర్చు రూ.7,708 అవుతోంది. అంటే రైతుకు మిగిలేది రూ.1,695 మాత్రమేనని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రైతు ఆదాయానికి సంబంధించి జాతీయ సగటు రూ.10,218గా ఉంది.
 - డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ