
మహబూబాబాద్అర్బన్, వెలుగు : మహబూబాబాద్ నడివాడలో అప్పుల బాధ తట్టుకోలేక పెదగాని ఉపేందర్(40)అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పెదగాని ఉపేందర్కు 30గుంటల పొలం ఉంది. గత రెండేండ్లుగా సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు పాలయ్యాడు. ఇల్లు కట్టేందుకు కొంత అప్పు చేశాడు. ప్రైవేట్ చిట్టీల పేరిట రూ.2లక్షలు పైగా పోగొట్టుకున్నాడు. దీంతో మొత్తం రూ.10లక్షలకు పైగా అప్పు అయింది. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. భార్య అనితకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఉపేందర్కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.