మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చంద్రుపల్లికి చెందిన గోమాస ధర్మయ్య (45) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మయ్యకు అర ఎకరం పొలం ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంట సాగు చేస్తూ వచ్చాడు. ఆశించినంత దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి. రెండేండ్లు వ్యవసాయం బంద్ చేసి హైదరాబాద్ వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవించాడు.
డబ్బులు సరిపోకపోవడంతో తిరిగి చంద్రుపల్లికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. అయినా, అనుకున్నంత దిగుబడి రాకపోగా.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు రూ.5 లక్షలకు పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన ధర్మయ్య, ఈ నెల 5న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. అతన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. మృతుడికి భార్య రాజక్క, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.