అప్పుల బాధతో తెలంగాణ రైతు ఆత్మహత్య

పెంబి, వెలుగు: అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ లోని పెంబిలో  మంగళవారం ఉదయం  ఈ ఘటన చోటు చేసుకుంది. పెంబి ఎస్ఐ రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంబిలోని యాపల్ గూడ గ్రామంలో రైతు చిన్న రాజన్న (46) నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పత్తి పంట వేయగా అది సరిగ్గా పండలేదు. 

అంతే గాక కూతురు పెండ్లికి రూ.3లక్షలు అప్పు చేశాడు. పంట సరిగ్గా పండక పోవడంతో ఆ అప్పును ఏలా తీర్చాలో తెలియక సతమతమవుతుండేవాడు. రోజూలాగే మంగళవారం ఉదయం 5 గంటలకు చేనుకు వెళ్లిన రాజన్న ఉదయం 10 గంటల వరకు కూడా తినడానికి ఇంటికి రాలేదు. 

దీంతో భార్య లక్ష్మీకి అనుమానం వచ్చి చేనుకి వెళ్లి చూడగా అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలోనే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.