
హైదరాబాద్, వెలుగు: జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్‌పో వేదికపై తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించడం రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. శనివారం ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరల్డ్ ఎక్స్‌పోలో రాష్ట్ర రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో నూతన విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ..రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకం, సన్న వడ్లకు రూ. 500 బోనస్, రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ వంటి చర్యలను వివరించారు. ఈ పథకాలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు.