మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట ఏది?

క్షణంలో కమ్ముకొస్తున్న మబ్బులను, అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలని తెలంగాణ రైతులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో అనేక జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన ధాన్యం తడిసింది.  గత నెలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సీఎం ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటన చేసినా, క్షేత్రస్థాయిలో సర్వే మొదలై  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, ఒకపైసా ఏ రైతుకు నేటికి ఇవ్వలేదు. వడగండ్ల వానలతో దిక్కుతోచక తెలంగాణ రైతులు తల్లడిల్లుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప, ఇదిగో సాయమని అందించే గతిలేదు. తెలంగాణ రైతులను అన్ని కష్టాల్లోంచి విముక్తి చేసినట్లు, తెలంగాణ భారతదేశానికే ఒక గొప్ప మోడల్ గా  కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి మహారాష్ట్రలో ఎన్నికలను తలపించే భారీ ప్రచారం ముమ్మరం చేసారు. బీఆర్ఎస్ పెట్టిన నాటి నుంచి తెలంగాణ ప్రజా సమస్యలను గాలికొదిలారు.  వడగండ్ల వానలు పంట నష్టాలతో రైతాంగం పూర్తిగా అతలాకుతలం అవుతుంటే వచ్చే ఎన్నికలకై ఇతర రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించి సభలకు కోట్లు వెదజల్లుతున్నారు. అది తెలంగాణ జనం సొమ్ము కాదా?దేశంలో తెలంగాణ మోడల్ పేర, ఎన్ని కోట్లు వెదజల్లినా మహారాష్ట్ర మార్కెట్ కమిటీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఇటీవలే వాత పెట్టారు.

ప్రైవేటు మార్కెట్​లో అమ్ముకుంటున్నారు

ధాన్యం ఏ రైసు మిల్లుకు వెళ్లాలని నిర్ణయించే ట్యాగింగ్ నెల తర్వాత గానీ ఇవ్వలేదు. తెలంగాణ పాలకులు ఎప్పుడో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గంభీర ప్రకటనలు చేసినా, నెల రోజులపాటు కొనుగోళ్లే జరగలేదు.  ప్రతి చివరి గింజనూ కొంటామనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల గంభీరమైన మాటలకు విలువ ఉందా?   విసిగి వేసారిన రైతులు అనేక జిల్లాల్లో గిట్టుబాటుధర వదిలేసి అయిన కాడికి ప్రైవేట్ మార్కెట్ కు అమ్ముకుంటున్నారు.    కారు చౌకగా క్వింటాలు 1700 రూ. అమ్ముకున్నారు. ఒక క్వింటాకు రైతు 460 రూ. నష్టపోయారు. రైతులను తప్పుపట్టడానికి వీలేలేదు. ఆ నష్టపోయిన రైతులకు మద్దతుధర చెల్లించాలి. ప్రభుత్వమూ మిల్లర్లు కుమ్మక్కై కొనుగోళ్లు నిలిపివేస్తే రైతులు కారుచౌకగా అమ్ముతారనే భావన బలంగా వుంది.  ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, తెలంగాణ రైతులను గాలికొదిలి, ఈ రైతులు అన్ని బాధల నుంచి విముక్తి అయినట్లు, మహారాష్ట్రలో దేశంలో రైతురాజ్యమనడం మరోమోసం కాదా?  మిల్లర్లు అనేక సాకులతో వడ్లను వేగంగా దించుకోవడంలేదు. లారీలు సకాలంలో రావడం లేదు. లారీలు పంపాలని, వేగంగా దించుకోవాలని, దోపిడీని ఆపాలని రోజూ రైతులు రోడ్లెక్కుతూనే వున్నారు.  రైతు రుణంలో ప్రీమియం కట్ అవుతున్నా, కంపెనీలు రైతులకు బీమా ఇవ్వవు. ప్రభుత్వానికి పట్టదు. నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకునే సమగ్రబీమా పథకం కావాలిప్పుడు. 

వెంటనే పంట నష్టం ఇవ్వాలి

23,505 ఎకరాల్లో మామిడి పంట నష్టమైందని అధికారుల అంచనా. 9500 ఎకరాల్లో నువ్వు పంట నష్టమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేల ఎకరాల పంట నష్టం. మంచిరాల జిల్లాలో 3 రోజుల వడగండ్ల వానలతో  మొత్తం 2379 ఎకరాల్లో పంట నష్టమైంది. సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున పంట నష్టపోయింది. పెద్దపెల్లి జిల్లాలో 3631 ఎ. వరి, మక్క, మామిడి రైతులు నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో వెయ్యి ఎకరాల మామిడి, వరి తదితర పంట నష్టపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం వదలలేదు. మిర్చి నేలకు ఒరిగింది. ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండతో పాటు అనేక చోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజమాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేయగా అన్నదాతలు అల్లకల్లోలానికి గురయ్యారు. వేలాది ఎకరాల్లో  వరి, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్, మహబూబ్​నగర్, రంగారెడ్డి పట్ల అకాల వర్షాలు శాపంగా మారాయి. వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. ప్రతి చివరి గింజను కొంటామనే పుక్కిడి డైలాగులు మాని,  కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న  సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అలాగే, పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతులను ఆదుకోవాలి. పటిష్ట, సమగ్ర పంటల కొనుగోలు విధానం తీసుకు రావాలి. తరుగు పేర అడ్డగోలు దోపిడీ ఆపాలి. తక్షణమే లారీలను అందుబాటులో ఉంచాలి. రైస్​ మిల్లర్ల పై నిఘా పెట్టాలి.

కొనుగోళ్లలో గోల్​మాల్​

కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలున్నందున కేసీఆర్ రంగంలోకి దిగి ప్రతి చివరి గింజను కొంటామని ప్రకటించినా, క్వింటాలుకు 11 కిలోలు మిల్లర్లు దోచుకొంటున్నారని ఆగ్రహంతో ఖానాపూర్ రైతులు రోడ్డెక్కారు. ఒక 40 కిలోల బస్తాకు 2 కిలోలు, 3కిలోలు అదనంగా అర్పిస్తేనే కొంటామని మిల్లర్లు మొండికేస్తున్నట్లు రైతులు రోజూ రోడ్లపై రాస్తారోకోలు నిత్యకృత్యమయ్యాయి. అంటే క్వింటాల్ కు 7- నుంచి10 కిలోల దోపిడీ ప్రతిఏటా సార్వత్రికంగా సాగుతుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రభుత్వ సహకార సంఘాలు, రైసు మిల్లర్లు కుమ్మక్కై అడ్డగోలుగా దోచుకుంటున్నారనేది  కేసీఆర్ కు కనబడడం లేదా? ప్రతి బస్తాకు లారీకి 2-5 రూ. దోపిడీ సాగుతుంది. కల్లాల్లో వేల బస్తాలు లారీలు లేక కదలడం లేదు. లారీల కొరత తీవ్రంగా వుంది. కోతకోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యాన్ని నెల రోజులైనా తగిన వేగంతో కదలని దుస్థితి. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతాంగం అధికారులను, మిల్లర్లను నిలదీస్తూ, రోడ్లపై ధాన్యం పోసి అగ్నికి ఆహుతి చేస్తున్నా గోడు వినేవారే లేరు. 

- నైనాల గోవర్ధన్