ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సినీ పరిశ్రమలో ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ బతుకుతున్నదని, దీన్ని తిప్పి కొట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎల్ నరసింహరావు కోరారు. ఈ విషయంపై తెలంగాణ సినీ ఆర్టిస్టులు, కళాకారులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘మన రాష్ట్రం మన సినిమా’ అంశంపై సమావేశం నిర్వహించారు.
తెలంగాణ సినీ ఆర్టిస్టుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బెనిఫిట్ షోల పేరిట వచ్చిన డబ్బులను సినీ ఆర్టిస్టులు, కళాకారుల అమరవీరుల కుటుంబాలకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలనిప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సినీ పరిశ్రమను కాపాడుకునేందుకు మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మురళీధర్ దేశ్పాండే, శ్యామ్ రావు, రజిత, సుధాకర్, ఈశ్వర్, సోమేశ్వర్, వెంకటస్వామి, కస్తూరి శ్రీనివాస్, వేణుగోపాలరావు పాల్గొన్నారు.