
- వచ్చే 20 నెలల్లో మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేస్తం
- కేసీఆర్ నిర్వాకం వల్లే 10 ఏండ్లుగా పెండింగ్
- మళ్లీ మేం వచ్చాకే పనులు వేగవంతం
- మంత్రులు ఉత్తమ్, పొంగులేటి వెల్లడి
- దేవన్నపేట వద్ద పంపింగ్ స్టేషన్ పరిశీలన
వరంగల్/హనుమకొండ, వెలుగు: పంటలను కాపాడేందుకు దేవాదుల ప్రాజెక్టు పనులను స్పీడప్ చేశామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లోని 50–60 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టు మూడో ఫేజ్‌లోని ఒక మోటార్‍ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంపింగ్ స్టేషన్‍ను మంత్రులు మంగళవారం సందర్శించారు. మోటార్ల వద్ద పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రారంభించే ఒక్క పంపు ద్వారా స్టేషన్ ఘన్‍పూర్, జనగామ, పాలకుర్తితో పాటు పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేటలో పంటలకు నీరు అందుతుందని తెలిపారు. హైదరాబాద్‍లో కూర్చొని రివ్యూ చేయడం కన్నా డైరెక్ట్‌గా ప్రాజెక్టును సందర్శించి, రైతులకు నీరందించాలని వచ్చామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు మూడు ఫేజ్‍లను 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కోసం జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‍ను కలిశామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తీరు వల్లే దేవాదుల ప్రాజెక్ట్పూర్తికాక రైతులు ఇబ్బందులు పడ్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.
వైఎస్‌ఆర్హయాంలో దేవాదుల ద్వారా నీళ్లందించగా.. మళ్లీ సీఎం రేవంత్‍రెడ్డి, మంత్రి ఉత్తమ్‍కుమార్ రెడ్డి కలిసి దేవాదుల ప్రాజెక్ట్‌పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ హయాంలో కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టారని, 24 ఏండ్ల కింద మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో దేవాదుల పనులు చకచక సాగాయి.
కేసీఆర్ ఉన్న పదేండ్లలో పనులు ఆపేశారు. దీంతో నాడు రూ.6 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం.. ఇప్పుడు రూ.18 వేల కోట్లకు చేరింది. మిషన్ భగీరథ కింద బీఆర్‍ఎస్ రూ.39 వేల కోట్లు ఖర్చు చేస్తే కేవలం 51 శాతం మందికి మాత్రమే తాగు నీరు అందుతున్నది. ఇవన్నింటిపై నిలదీస్తామనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. బడ్జెట్, గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రశ్నించే అవకాశం ఉండదనే అప్పుడు సభకు వచ్చారు” అని అన్నారు.