తెలంగాణ తొలి ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు : నలమాస స్వామి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏర్పడాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యాపిస్తోంది.  టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు మారిందని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. గతంలో తెరాస పార్టీ రాష్ట్రం ఏర్పాటుకోసం పోరాడితే సకల జనులు అనేక జేఏసీలుగా ఏర్పడి అనూహ్యంగా ఉద్యమించారు. 1969 తొలి ఉద్యమకారులు మలి ఉద్యమంలోనూ ఆనాటి అభినివేశంతో రంగం లోకి దిగి రాష్ట్ర ఏర్పాటుదాకా అవిశ్రాంతంగా పోరాడారు. బలీయమైన ప్రజల రాష్ట్ర కాంక్షను దృష్టిలో పెట్టుకొని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలిచాయి. 2014లో పార్లమెంట్, రాజ్యసభల్లో తెలంగాణ బిల్ పాసయ్యేంతవరకు శ్రమించాయి. ఆ కృషి కారణంగా రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఎన్నికల వేళ తెలంగాణ మీద పట్టు సాధించడానికి జాతీయ పార్టీలు రెండూ పోటీ పడుతున్నాయి. టీఆర్‌‌ఎస్‌ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేసి బీఆర్ఎస్ పార్టీపెట్టి జాతీయవాదాన్ని నెత్తికెత్తుకోవడం కూడా ఒకఅవకాశంగా భావిస్తున్నాయి. ఐతే తెలంగాణ 1969 తొలిఉద్యమకారులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదు. దాంతో కేసీఆర్ తమకు పెన్షన్లు ఇస్తాడనే నమ్మకం కోల్పోయారు. రాజ్యాంగాన్నే అవమానిస్తున్న సీఎం ఉద్యకారులకు పెన్షన్స్ ఇచ్చి గౌరవిస్తాడా? అనే నిస్పృహలోకి వచ్చారు.   

అమరుల స్థూపం పూర్తయితేనే..

తెలంగాణ రాష్ట్ర రెండో అవతరణ దినోత్సవం వేదిక మీద (2016) సీఎం 1969 ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి పెన్షన్స్ ప్రకటించబోయారు కానీ అది జరగలేదు. అప్పటి నుంచి తొలి ఉద్యమ కారులు పెన్షన్స్ సాధించు కొనేందుకు మరింత ఉద్యమిస్తూ వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు తెలంగాణ తొలి ఉద్యమకారుల నాయకులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి తెలంగాణ యోధుల జాబితా సిద్ధం చేసుకొని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయనకు అందించారు. మరి కొందరు ఉద్యమ నాయకులు మునుగోడు ఎన్నికలకు ముందు మరొక జాబితాను అమిత్ షాకు అందించారు. ఇదే క్రమంలోం ‘పెన్షన్స్ భిక్షం కాదు అది మా హక్కు’ అని 1969 తెలంగాణ మూవ్‌మెంట్ డిటెనర్స్ ఫోరమ్ సభ్యులు తమ పెన్షన్స్ లని సాధించుకొనేందుకు తెలంగాణ హైకోర్ట్ ని ఆశ్రయించారు. రాష్ట్రానికి ముందు ఏర్పడ్డ ఉత్తరాబఖండ్ లాంటి రాష్ట్రాలు అక్కడి పోరాట యోధులకు పెన్షన్స్ ఇస్తున్న వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అయినా ఇక్కడి ఉద్యమకారుల్ని గుర్తించం గాక గుర్తించమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. తొలి ఉద్యమం నాయకులమని చెప్పుకొనే తొత్తులు అమరుల స్థూపం పూర్తయితే అప్పుడు పెన్షన్స్ గురించి సీఎం ఆలోచిస్తారని చెబుతున్న దాని మీద కుడా ఆశ వదులుకున్నారు.  

కొత్త ప్రభుత్వం వస్తేనే..

రాష్ట్రంలో నిరంకుశ పాలన, దాని పరిణామాలు చూసిన తర్వాత ఉద్యమకారులు కొత్త ప్రభుత్వం వస్తే తప్ప తమ పెన్షన్స్​కు విముక్తి లేదని నిర్ణయించుకొన్నారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రవీంద్ర భారతిలో ఉద్యమకారులంతా ఘన సన్మానం చేయడం ఉద్యమకారులు ఆ వైపు చేరుతారనే విషయం స్పష్టమవుతోంది. అలాగే తెలంగాణ తొలి ఉద్యమ నాయకులు కొందరు రాష్ట్ర బీజేపీ చీఫ్  ను కలవడం కూడా వారి చూపు బీజేపీ వైపే ఉందనేది ఊహించవచ్చు. దేశంలో కొత్త గా ఏర్పడ్డ  రాష్ట్రాల్లో ఇచ్చినట్టే తెలంగాణ కోసం పోరాడి జైలుపాలైన మాకు కనీసం పెన్షన్స్ ఇవ్వాలనేదే వారి డిమాండ్. ఇండియా టు డే, ఇతర సంస్థల సర్వేల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెల్సి, తెలంగాణలోనూ ఆ పార్టీ వస్తే తప్పక మాకు పెన్షన్స్ వస్తాయని ఉద్యమకారులు గంపెడు ఆశ పెట్టుకొంటున్నారు. ఆ దిశగా సాటి ఉద్యమకారులను కూడగట్టుకొంటున్నారు. ‘తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు మోసపోతివా నీవు గోసపడతావు’ అంటూ 1969లో నినదించిన ఉద్యమకారుల కలలు రాష్ట్ర ఏర్పాటుతో నెరవేరాయి కానీ ఈ అధినాయకుని నమ్మి ఉద్యమకారులు మోసపోతున్నారనేది నిజం.  

తెలంగాణ ఒక్కని వల్ల రాలే..

‘అతడి ఒక్కడివల్లే తెలంగాణ రాలేద’ని దేశంలోని ప్రజలందరికీ తెల్సు. రాజ్యాధికారానికి వచ్చిన చరిత్రహీనులు తమ చరిత్రే మిగలాలని చూడ్డం సహజం. దానికి మూలధనంగా వారి డీఎన్‌ఏ నే నిలుస్తుంది. మారినకాలంలో ప్రజలే ప్రభువులవుతారు కానీ ఇలాంటి ప్రభువులుకారు. తన కులం వాడైతే చాలు దారిద్ర్య రేఖకు దిగువనున్నోడు వందలకోట్లకు ఎదుగుతాడు. అర్హత లేకున్నా ఎం.ఎల్.సి,వి.సి.పదవులు వరిస్తాయి. అంతేగాదు సాండ్, ల్యాండ్, ఫార్మా, లిక్కర్ మాఫియాలకు తెలంగాణను అప్పజెప్పి పాలకులు అందినంత దోచుకోనిస్తారు. కానీ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు లిప్తహస్తం చూపిస్తారు. అన్యాయాల్ని అడ్డుకొంటున్న వారిని అరెస్ట్ చేసి, నిజాం పాలనను తలపింప చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే, రాజ్యాంగాన్ని మార్చాలనే వారితో కమ్యూనిస్టులు చేతులు కలిపి గత ఘన చరిత్రను కోల్పోబోతున్నారు. ప్రజల భావాలను పరికించి పాలించే ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు బీజేపీ ఇప్పుడు ఒక ఆశా కిరణం. సామాన్యులకు పట్టం కట్టే పాలసీ బీజేపీది.  

- నలమాస స్వామి, 
 అధ్యక్షులు, తెలంగాణ సమరయోధుల సంఘం