మూగబోయిన ఉద్యమగళం..

మూగబోయిన ఉద్యమగళం..

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6)  కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. 

ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ (Gaddar).. పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్‌ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావ్‌. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌(Gaddar)  అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌ (Gaddar). నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు అందుకున్నారు. అయితే, నంది అవార్డును తిరస్కరించారు.

 ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ ఉద్యమ రీతుల్లో సాంస్కృతిక ఉద్యమం అత్యంత కీలకమైంది.   రాజకీయ పార్టీలు ప్రజలను పోరాటం వైపు ఉసిగొలిపితే.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో రగిలించిన ఘనత మాత్రం తెలంగాణ సాంస్కృతిక కళాకారులది. తొలి, మలి దశ అన్న తారతమ్యం లేకుండా ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహరహం పరితపించిన గాయకుడు, ప్రజాకవి గద్దర్. ఆయన పాత్ర రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేకమైంది.

గద్దర్ ప్రస్థానమిదీ..

గద్దర్ (Gaddar) అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో ఓ నిరుపేద దళిత కుంటుంబంలో 1949లో శేషయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో, హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాట భావాలు కలిగిన గద్దర్ తెలంగాణ వెనుకబాటు తనాన్ని, వలస పాలకుల ఆధిపత్యంలో శిథిలమవుతున్న తెలంగాణ జీవన విధానాన్ని కళ్లారా చూస్తున్న గద్దర్ ప్రత్యేక రాష్ట్ర సాధనే సమస్యలన్నింటికి పరిష్కారమని భావిస్తూ వచ్చారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు.

గద్దర్ పేరు వచ్చిందిలా...

గద్దర్ (Gaddar)ఉద్యమ భావ వ్యాప్తికి బుర్రకథను ఎంచుకున్నారు. ఓ రోజు ఆయన ప్రదర్శనను చూసిన సినీ దర్శకుడు బి. నరసింగ రావు... భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన గద్దర్ (Gaddar)ఆ రోజు ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత నరసింగరావు ప్రోత్సాహంతో ప్రతీ ఆదివారం బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో గద్దర్ అనే ఆల్బమ్ కోసం ఆయన ఆపర రిక్షా పేరుతో ఓ పాట రాశారు. ఆ తర్వాత ఆ పాట మంచి శ్రోతల ఆదరణ లభించడంతో విఠల్ రావు పేరు గద్దర్ గా స్థిరపడింది. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటే సామాజిక అంశాలపై గద్దర్ బుర్రకథలు ప్రజర్శించి ప్రజలకు అవగాహన కల్పించే వారు. బుర్రకథలతో పాటు పాటలు కూడా రాసి, సొంతంగా పాడే వారు. 1972లో ఏర్పాటైన జననాట్య మండలి అనే సంస్థ గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలను, ఆకృత్యాలను ఎదురించి... ప్రజలను... ప్రత్యేకించి దళితులను మేల్కొలిపేందుకు వారిని చైతన్య పరచేందుకు ఏర్పడింది.


బ్యాంకు ఉద్యోగం.. ఆ వెంటనే పెళ్లి..

1975లో గద్దర్ (Gaddar)కు కెనరా బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకున్నారు. ఆయనకు భార్య పేరు విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. చంద్రుడు 2003లో అనారోగ్యంతో మరణించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మాభూమి సినిమాలో గద్దర్ (Gaddar)సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే పోతవు కొడుకో నైజాము సర్కరోడా’ అనే పాటను గద్దర్(Gaddar) స్వయంగా పాడి గజ్జె కట్టి ఆడారు. ఈ పాటకు గద్దర్ కు మంచి గుర్తింపు వచ్చింది. సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలపై తన మదిలోనే నిత్యం సంఘర్షణ జరిపేవారు గద్దర్. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1985లో కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. జన నాట్య మండలిలో క్రియాశీల సభ్యునిగా చేరారు.

పాటలతోనే ప్రత్యేక గుర్తింపు..

‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో.. నువు చినబోయి కూచున్న వెందుకమ్మో.. ఎందుకమ్మా.. చలికాలమొచ్చింది చాప చింపులు లేవు.. బొంత కుడుదామంటే బట్ట పేల్కలు లేవు’ అని దళితుల ధైన్యాన్ని కళ్లుకు కట్టనట్టు వివరించారు గద్దర్. తన పాటలను తన బృందంతో కలిసి క్యాసెట్లు, సీడీలుగా తయారు చేసి విక్రయించేవారు. ఇవి వేలాదిగా అమ్ముడు పోయేవి. 1980 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గద్దర్ పాటలే వినిపించేవంటే అతిశయోక్తి కాదు.

గద్దర్‌పై కాల్పులు.. శరీరంలోకి ఆరు బుల్లెట్లు..

1997 ఏప్రిల్ 6 న గద్దర్ (Gaddar) ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గద్దర్ పై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. తూటాలన్నింటిని వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించినా నడుము భాగంలో ఒక్క బుల్లెట్ మాత్రం అలాగే ఉంది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఆయన ఒంట్లో ఆ బుల్లెట్ అలాగే ఉంది. పోలీసులే గద్దర్ పై కాల్పులు జరిపారని కుంటుబ సభ్యులు అనుమానిస్తున్నారు.

అయితే ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు. అయినా పోలీసుల బాధలు వర్ణిస్తూ ‘పొట్టా కూటి కోసం కొడుకు పోసుసుళ్ల చేరినాడు... యాడా ఉన్నడో కొడుకు.. ఏమీ తిన్నడో...’ అని పాడారు గద్దర్.  తనపై జరిగిన హత్యా యత్నాన్ని వర్ణిస్తూ... ననుగన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా.. మీ పాటనై వస్తున్నానమ్మో... మీ పాదాలకు వందనాలమ్మో... ఎడమా చేతిన దిగిన తూట ఎత్తామంది ఎర్రా జెండా’ అని వర్ణించారు.

 ఒకే వేదికపై కేసీఆర్, గద్దర్..

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గద్దర్ (Gaddar) అనేక వేదికలపై ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి వేదికలు పంచుకున్నారు. గద్దర్ ను కేసీఆర్ ప్రజా యుద్ధనౌక గా కీర్తించేవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గద్దర్, కేసీఆర్ దూరం దూరంగానే ఉంటున్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు.