- ఎలుకలు కొరికిన ఆప్రికాట్స్.. ఫంగస్ వచ్చిన ఆలు, పల్లీలు
- పాలమూరు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు
మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ లోని ప్రధాన హోటళ్లలో శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేశారు. స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ పి.రోహిత్ రెడ్డి, ఎస్.శ్రీషిక, ఎన్.జగన్నాథం, శివశంకర్ రెడ్డి టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
ఏనుగొండ ప్రాంతంలోని శ్రీ సంతోష్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను తనిఖీ చేయగా రూ.60,500 విలువైన చిప్స్, నమ్‌కిన్స్, వేయించిన పల్లీలు, వేయించిన పెసరపప్పు, కారా మిక్చర్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీజ్ చేశారు. ఎక్స్పైరీ అయిన లైసెన్స్ నంబర్ ను పలు ఆహార పదార్థాలపై ముద్రించి అమ్ముతుండడంతో వాటిని సీజ్ చేశారు.
యూరియా బ్యాగుల్లో పల్లీలు నిల్వ చేయడంతో వాటిని ధ్వంసం చేశారు. రూ.26 వేల విలువైన రీ యూజ్డ్ ఆయిల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ తో కూడిన ఆలుగడ్డలు, పల్లీలను ధ్వంసం చేశారు. పిస్తా హౌస్ ను తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో నోటీసులు ఇచ్చారు. స్టోర్ రూమ్‌లో ఎలుకలు కొరికిన ఆప్రికాట్స్ డ్రై ఫ్రూట్స్ ను గుర్తించి ధ్వంసం చేశారు.
160 కిలోల కల్తీ టీ పౌడర్, మూడు కేజీల యాలకులను సీజ్ చేశారు. స్టోర్ చేసిన మాంసాన్ని గుర్తించారు. కిచెన్ లో డ్రైనేజీ సిస్టం బ్లాక్ కావడంతో ఈగలు ఆహార పదార్థాలపై వాలుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, నోటీసులు ఇచ్చారు. పది రోజుల్లో సరి చేసుకోకపోతే శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు.