తెలంగాణ అటవీ శాఖ.. పేపర్​లెస్.. ఇకపై డేటా అంతా ఆన్​లైన్​లోనే..

హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖలో పేపర్ రహిత పాలనకు అధికారులు శ్రీకారం చుట్టారు. నిధులు, విధులు వంటి వివరాలను ఆన్​లైన్​లో పెడుతున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ నర్సరీలు ఏర్పాటు చేశారు, ఏ నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, ఎన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఫ్లాంటేషన్  చేశారు వంటి వివరాలను జిల్లా, డివిజన్, రేంజ్ ల వారీగా ఆన్​ లైన్​లో పొందుపరుస్తున్నారు.

గతంలో జిల్లా, డివిజన్  వివరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రేంజ్​లకు సంబంధించిన వివరాలు కూడా నమోదు చేస్తున్నారు.  ఏ రేంజ్​లో ఏం పనులు చేస్తున్నారు, కేటాయించిన నిధులు, నమోదైన కేసులు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్  చేస్తూ పట్టుబడిన వాహనాలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్​ లైన్​  చేస్తున్నారు. కవ్వాల్, అమ్రాబాద్, నెహ్రు పార్క్, అర్బన్  పార్కుల తదితర వివరాలు కూడా నెట్ లో అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ​లింక్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్లిక్  చేస్తే  ఫారెస్ట్, పార్కు  వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి.   

తునికాకు కూలీలకు ఆన్​లైన్​లో పేమెంట్
తునికాకు కూలీలకు అటవీ శాఖ నేరుగా వారి అకౌంట్​లో డబ్బులు జమచేస్తున్నది. గతంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే, వారు చెల్లించేవారు.  కాంట్రాక్టర్లు కూలీల డబ్బును దుర్వినియోగం చేస్తుండటంతో కూలీల అకౌంట్​లో అధికారులు డబ్బులు వేస్తున్నారు.  తునికాకు సేకరణ వివరాలు  కూడా రోజువారీగా నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా టింబర్  డిపో, సామిల్స్ అనుమతులు, లైసెన్స్​ రెన్యూవల్  వివరాలను కూడా ఆన్​ లైన్​లో పొందవచ్చు. ఎవరైనా వారి సొంత స్థలంలో చెట్లు తొలగించాలంటే రూ.450 చెల్లించి ఆన్​ లైన్​లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గతంలో  ఫారెస్ట్  ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా అయ్యేది. ఇప్పుడా  పరిస్థితి లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు స్టేటస్  కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. కలప స్మగ్లింగ్, జంతువుల వేటకు సంబంధించిన కేసులు తదితర   వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. 2023–24లో 3,424 కేసులు నమోదయ్యాయి. అడవి జంతువుల దాడిలో  పశువులు, మనుషులు గాయపడితే పరిహారం కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.  ఎంత పరిహారం ఇచ్చారనే వివరాలు అందుబాటులో ఉంటాయి.

రోజుకు నాలుగుసార్లు ఫైర్ అలర్ట్ మెసేజ్లు
అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, ఆక్రమణలపై పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అడవిలో ఏం జరిగినా శాటి లైట్ల ద్వారా క్షణాల్లో  తెలిసిపోతుంది. అగ్ని పోర్టల్ లో ఫారెస్ట్  అధికారుల నంబర్లతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్, అగ్రికల్చర్  తదితర డిపార్ట్ మెంట్లకు సంబంధించిన అధికారుల నంబర్లను రిజిస్టర్  చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రిజిస్టర్​ అయిన నంబర్లకు మెసేజ్​ వస్తుంది. ఏ లొకేషన్ లో ప్రమాదం జరిగిందో మెసేజ్​ వస్తుంది. రోజుకు నాలుగుసార్లు మెసేజ్​లు వస్తాయి. పగలు రెండు, రాత్రి రెండుసార్లు అలర్ట్ మెసేజ్​లు వస్తాయి.  2023– 24 సంవత్సరంలో 14,048 అగ్నిప్రమాద హెచ్చరికలు రాగా.. 13,736  ప్రదేశాలకు అధికారులు వెళ్లారు.  215 చోట్ల ఫైర్ అయినట్లు మెసేజ్​ వచ్చినా అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు.