ఫైర్ మానిటరింగ్​కు డ్రోన్లు!.. అడవిలో అగ్ని ప్రమాదాలను గుర్తించడానికి కొత్త టెక్నాలజీ

ఫైర్ మానిటరింగ్​కు డ్రోన్లు!.. అడవిలో అగ్ని ప్రమాదాలను గుర్తించడానికి కొత్త టెక్నాలజీ
  • డ్రోన్  కెమెరాలతో వైల్డ్ లైఫ్ పర్యవేక్షణ.. నెలాఖరులోగా వాడుకలోకి..
  •  అడవిలో అక్కడక్కడ ఫైర్ లైన్స్.. అందుబాటులోకి 850 బ్లోయర్స్  
  •  వేసవి కోసం అటవీశాఖ అలర్ట్


హైదరాబాద్, వెలుగు: అడవి లోపల అగ్ని ప్రమాదాలను వెంటనే గుర్తించి, నష్టాన్ని తగ్గించేందుకు అటవీ శాఖ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. ప్రమాదం జరగ్గానే శాటిలైట్ ద్వారా సమాచారం అందుకొని డ్రోన్​ కెమెరాల ద్వారా ప్రమాద స్థలాన్ని కచ్చితంగా గుర్తించి మంటలార్పేందుకు సమాయత్తమవుతున్నది. ప్రస్తుతం అటవీశాఖ ప్రయోగాత్మకంగా రెండు  డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెలాఖరులోగా అమ్రాబాద్, కవ్వాల్ రిజర్వ్​ఫారెస్ట్, ఏటూరు నాగారం అడవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు పనిచేయనున్నాయి.  డ్రోన్లతో అగ్ని ప్రమాదాల గుర్తింపుతోపాటు అడవీ సంపదను స్మగ్లర్ల నుంచి కాపాడొచ్చని అధికారులు చెబుతున్నారు. 

అటవీ ప్రాంతాల్లో ఫైర్ లైన్స్ ఏర్పాటు 

రాష్ట్రంలో 26,969 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతం ఉంది. 56 డివిజన్లు, 10 సర్కిళ్లు, 250పైగా రేంజ్​లుగా విభజించారు. వేల సంఖ్యలో సెక్షన్లు, బీట్లు, కంపార్టుమెంట్లు పనిచేస్తున్నా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కువగా రోడ్లకు సమీపంలోనే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 13,497, ఈ ఏడాది ఇప్పటివరకు 1,081 అగ్ని ప్రమాదాలు జరిగాయి.

 ఇందులో ఎక్కువగా భద్రాచలం సర్కిల్​లో 344, తక్కువగా జోగులాంబ, యాద్రాద్రి సర్కిల్ 4 చొప్పున ఫైర్స్ జరిగాయి. ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం, ఇల్లెందు, భద్రాచలం, ఖానాపురం, ఆసిఫాబాద్, అచ్చంపేట, మన్ననూర్ ప్రాంతాల్లో తరచూ ఫైర్స్ అవుతుంటాయి. అయితే ఈ మంటలు త్వరగా వ్యాపించకుండా అటవీ ప్రాంతంలో ఐదు మీటర్ల వెడల్పుతో ఫైర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ పక్కల ఉన్న ఎండిన ఆకులను బ్లోయర్స్​తో  లైన్లుగా ఏర్పాటు చేస్తూ వీటి మధ్య ఖాళీ ప్లేస్​వదులులారు. చిన్నచిన్న చెట్లు, ఆకులు కాలుఉంటూ వచ్చి ఈ ఫైర్​ లైన్ల ఖాళీ ప్లేస్​ వద్ద మంటలు ఆగిపోతాయి. దీంతో మంటల వ్యాప్తిని నివారించొచ్చు.  

ప్రమాదాల నివారణకు అటవీ శాఖ చర్యలు

అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ కొత్త అగ్నిమాపక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో 650 బ్లోయర్స్ ఉండగా మరో 250 బ్లోయర్స్  కొన్నారు. స్పేడ్స్, గమ్ బూట్లు, బూట్లు, ఫైర్ రిటార్డర్లు, గ్లోవ్స్, హెల్మెట్లు, గాగుల్స్, ఐ గేర్, టార్చిలైట్లు తదితర పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వేసవిలో రాత్రి, పగలు గస్తీ నిర్వహించేలా ప్లాన్​ చేస్తున్నారు.  అటవీ ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అడవి వెళ్లినప్పుడు నిప్పు రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చవద్దని సూచిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో బేస్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ కోసం పనిచేస్తాయి.   

శాటిలైట్ ద్వారా సమాచారం

అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు శాటిలైట్​ సేవలను ఉపయోగించుకోనున్నారు. ఫైర్​ జరిగిన వెంటనే ఫైర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్​కు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు ఆ  ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపడుతారు. అడవిలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అటవీ సమీపంలో రోడ్ల పక్కన బీడీ, సిగరెట్లు తాగి పడేయడంతో, కొందరు వన భోజనాలు చేసే చోట మంటలు ఆర్పకపోవడం వల్ల మంటలు రాజుకుంటున్నాయి. అటవీకి సమీపంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కూడా మంటలు అంటుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.