డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి ఉత్సవాలు : సీఎం రేవంత్​రెడ్డి

డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి ఉత్సవాలు : సీఎం రేవంత్​రెడ్డి

అదే రోజు సెక్రటేరియట్ ఆవరణలో విగ్రహావిష్కరణ: సీఎం రేవంత్​
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది
ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు  తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. డిసెంబర్​ 9న సెక్రటేరియేట్​ఆవరణలోనే కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్​ స్పష్టం చేశారు. ఈ సారి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని చెప్పారు.  తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపకల్పనపై కసరత్తు  జరుగుతున్నదని తెలిపారు.  

2009 డిసెంబర్ 9న తెలంగాణ తొలి ప్రకటన

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తొలి  ప్రకటన చేసింది.  అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ఈ ప్రకటన చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక రూపం ఇచ్చారు. ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. అనంతరం 2014లో సోనియా గాంధీ చొరవతో  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. 

అందుకే అదేరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ఆవిష్కరించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని రేవంత్​రెడ్డి సంకల్పించారు. కేసీఆర్ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియెట్ బయట కాకుండా.. సచివాలయ ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని రేవంత్ ఇదివరకే ప్రకటించారు.