
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కాలనీలో గల పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్తూనే కాలయాపన చేస్తున్నారని అన్నారు.
సీఎం, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా.. ఫలితం లేకపోవడం బాధాకరమన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు నిరసన తెలుపుతామని, త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. అలాగే, మహబూబాద్ జిల్లా కురవి మండలం కాకులబోర్డు తండా మాజీ సర్పంచ్ గుగులోతు కౌసల్య భర్త కిషన్ నాయక్ (50) అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారని, బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
కిషన్ నాయక్ మృతికి గన్ పార్క్ వద్ద నివాళి అర్పించారు. కిషన్ నాయక్ అభివృద్ధి పనుల కోసం రూ.30 లక్షలు అప్పులు చేశారన్నారు. మృతిచెందిన సర్పంచ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్య, నర్సింలు, నాయకులు రమేశ్, మన్నె పద్మారెడ్డి, అరవింద్ రెడ్డి, వెంకటేశ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.