- ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీస్కురావాలి
- తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం విజ్ఞప్తి
బషీర్ బాగ్, వెలుగు: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. పదేండ్లుగా 100 మంది నాలుగో తరగతి ఉద్యోగులు ఏపీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం నాంపల్లిలోని ఆఫీసులో ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి కందురి గంగాధర్ రాష్ట్రంలోని నాలుగో తరగతి ఉద్యోగులతో సమావేశమయ్యారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తాము భాగస్వాములై పనిచేస్తున్నామని, వరద బాధితులను ఆదుకునేందుకు ఇటీవల సీఎం సహాయ నిధికి ఒకరోజు జీతాన్ని అందజేసినట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నారని, పెండింగ్ పెట్టిన ఉద్యోగుల డీఏలను కూడా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు ఖాదర్ బీన్ హసైన్, అసోసియేట్ ప్రెసిడెంట్ దాస్య నాయక్, ట్రెజరర్ ధనరాజ్, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.